Lokpal chairperson: లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నియామకం-exsc judge justice a m khanwilkar appointed lokpal chairperson three others are appointed as lok pal judicial members ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lokpal Chairperson: లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నియామకం

Lokpal chairperson: లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నియామకం

HT Telugu Desk HT Telugu
Feb 27, 2024 09:59 PM IST

Lokpal chairperson: లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ నియమితులయ్యారు. మరో ముగ్గురిని లోక్ పాల్ జ్యూడీషియల్ సభ్యులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ (పుష్ప గుచ్ఛం స్వీకరిస్తున్న వ్యక్తి)
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ (పుష్ప గుచ్ఛం స్వీకరిస్తున్న వ్యక్తి) (ANI)

Justice A M Khanwilkar: లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఖన్విల్కర్ 2022 జులైలో పదవీ విరమణ చేశారు. జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ ను లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా నియమించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు.

ముగ్గురు సభ్యులు

లోక్ పాల్ కు చైర్ పర్సన్ తో పాటు ముగ్గురు సభ్యులను కూడా రాష్ట్రపతి నియమించారు. జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతూ రాజ్ అవస్థిలను జ్యుడీషియల్ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముగ్గురు జ్యుడీషియల్ సభ్యులు కాకుండా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కే కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే, ప్రస్తుతం లోక్ పాల్ లో ఒక చైర్ పర్సన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ లోక్ పాల్ సభ్యుల్లో సుశీల్ చంద్ర మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాగా, అవస్థి ప్రస్తుతం లా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. లోక్ పాల్ జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి ప్రస్తుతం తాత్కాలిక చైర్ పర్సన్ గా వ్యవహిరస్తున్నారు.

సెలెక్ట్ కమిటీ సిఫారసులు

ప్రధానమంత్రి చైర్ పర్సన్ గా ఉన్న సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసులను స్వీకరించిన తర్వాత లోక్ పాల్ చైర్ పర్సన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. లోక్ పాల్ లో సాధారణంగా చైర్ పర్సన్ తో పాటు నలుగురు జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ కలిపి మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే 27న పూర్తయిన తర్వాత లోక్ పాల్ రెగ్యులర్ చీఫ్ లేకుండానే పనిచేస్తోంది.

జస్టిస్ ఖన్విల్కర్ వివరాలు

జస్టిస్ ఖన్విల్కర్ 2016 మే 13 నుంచి 2022 జూలై 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. శబరిమల మహిళల ప్రవేశం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం, ఆధార్ చెల్లుబాటు వంటి కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018)లో ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ ఖన్విల్కర్ కూడా ఉన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడానికి ముందు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.