Digvijaya Singh: దిగ్విజయ్ కామెంట్లతో మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ దుమారం.. బీజేపీ విమర్శలు.. స్పందించిన కాంగ్రెస్-digvijaya singh comments on surgical strikes after pulwama terror attack said no proof bjp slams congress reacts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Digvijaya Singh: దిగ్విజయ్ కామెంట్లతో మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ దుమారం.. బీజేపీ విమర్శలు.. స్పందించిన కాంగ్రెస్

Digvijaya Singh: దిగ్విజయ్ కామెంట్లతో మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ దుమారం.. బీజేపీ విమర్శలు.. స్పందించిన కాంగ్రెస్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2023 08:20 PM IST

Digvijaya Singh Comments on Surgical Strikes: 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కూడా దిగ్విజయ్ కామెంట్లపై స్పందించింది.

Digvijay Singh Comments: దిగ్విజయ్ కామెంట్లతో మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ హీట్ (PTI)
Digvijay Singh Comments: దిగ్విజయ్ కామెంట్లతో మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ హీట్ (PTI) (HT_PRINT)

Digvijaya Singh Comments on Surgical Strikes: 2019 పుల్వామా ఉగ్రదాడి (Pulwama Terror Attack) పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి కామెంట్లు చేశారు. 40 మంది భారత సైనికులు మృతి చెందిన ఆ విషాద ఘటనను ప్రస్తావించారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్‍లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో బీజేపీపై నేడు (జనవరి 23) మరోసారి ఆరోపణలు చేశారు. అనుమానాలు వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు..? ఆయన కామెంట్లపై కాంగ్రెస్ (Congress) పార్టీ ఎలా స్పందించిందంటే..

బీజేపీ అబద్ధం ఆడుతోంది

Digvijaya Singh Comments on Surgical Strikes: సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. “పుల్వామా ఘటన జరిగిన రోజు ప్రతీ కారును చెక్ చేశారు. అయితే ఓ స్కార్పియో కారు రాంగ్ సైడ్‍లో వచ్చింది. అయితే దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదు? ఆ తర్వాత అది ఢీకొట్టింది, మన 40 మంది జవాన్లు మృతి చెందారు. నేటి వరకు, ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంట్‍లో కానీ, బహిరంగంగా కానీ వెల్లడించలేదు” అని జమ్ములో భారత్ జోడో యాత్ర సందర్భంగా దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Digvijaya Singh Comments on Surgical Strikes: భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి.. పాకిస్థాన్‍ భూభాగంలోని ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పిన కేంద్రం.. ఆధారాలను ఎందుకు ఇవ్వడం లేదని ఆరోపించారు. “వారు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో చాలా మంది చనిపోయారని చెప్పారు. కానీ ఎలాంటి ఆధారం లేదు. వారు (బీజేపీ) చాలా అబద్ధాలను చెబుతున్నారు” అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

'అది ఆయన వ్యక్తిగతం'

Congress on Digvijaya Singh Comments: సర్జికల్ స్ట్రైక్స్‌పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. “దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. అది కాంగ్రెస్ అభిప్రాయం కాదు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దేశ ప్రయోజనాల కోసం సైన్యం చేసే అన్ని చర్యలకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. మద్దతిస్తూనే ఉంటుంది” అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

'ఆర్మీని కించపరిస్తే దేశం సహించదు'

జమ్ములో జరిగిన భారత్ జోడో యాత్రలో దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ కామెంట్లపై అధికార బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసింది. “మా హృదయం బరువెక్కింది. భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుండొచ్చు.. కానీ కాంగ్రెస్ విధానమంతా భారత్ తోడో (దేశ విభజన). హెడ్‍లైన్లలో ఉండేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలంతా బాధ్యతారాహిత్యమైన కామెంట్లు చేస్తున్నారు. సైన్యాన్ని కించపరిస్తే భారత్ అసలు సహించదు” అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు.

2016 ఉరి ఆర్మీ బేస్‍పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై సర్జికల్ దాడులు చేసింది. ఆ తర్వాత 2019 పుల్వామా దాడి తర్వాత భారత ఆర్మీ.. పాకిస్థాన్‍ భూభాగంలోని బాలకోట్‍లో ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ స్థావరంపై దాడి చేసింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మన జవాన్లు మట్టుబెట్టారు.