Democratic Azad Party: గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ
Democratic Azad Party: ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.
కాంగ్రెస్ నుంచి వైదొలిగిన దాదాపు నెల రోజుల తర్వాత ప్రముఖ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. కొత్త పార్టీ పేరు 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు.
‘నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 పేర్లను ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపారు. హిందీ, ఉర్దూ కలయిక 'హిందుస్తానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం..’ అని ఆజాద్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 23 మంది సభ్యుల బృందంలో ఒకరుగా ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంతర్గతంగా ప్రశ్నిస్తూ వచ్చారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ నాయకత్వానికి ఘాటైన ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ చర్యలను ప్రశ్నించారు. కీలక నిర్ణయాల్లో సంప్రదింపుల పర్వానికి తిలోదకాలనిచ్చారని మండిపడ్డారు.
గులాం నబీ ఆజాద్ 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2005 నుంచి 2008 వరకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1973 నుంచి ఆయన కాంగ్రెస్‌లో పనిచేస్తూ వచ్చారు. 1980 అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో లోక్‌సభకు ఎన్నికయ్యాక కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరారు.