Budget Session 2022: ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెరిగాయి- రాష్ట్రపతి
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన ప్రసంగంలో ఆరోగ్య మౌలిక వసతుల కల్పన, వాక్సినేషన్ విజయవంతమవడం వంటి అంశాలపై ప్రధానంగా ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిందని, ఇప్పటివరకు 150 కోట్ల డోసులు అందజేయగలిగిందని, రికార్డు సమయంలో పూర్తి చేసిందని ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా రూ. 64 వేల కోట్లతో ఆరోగ్య వసతులు ఏర్పాటు చేస్తూ దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితులు వస్తే ఎదుర్కొనేలా సంసిద్ధం చేశారని పేర్కొన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్ధిష్ట గ్రూపుల్లో ఇప్పటికే 70 శాతం రెండో డోస్ కూడా పూర్తిచేసుకున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో 6 కోట్ల కుటుంబాలు ఇంటింటికి నల్లా నీరు పొందుతున్నారని, హర్ ఘర్ జల్ పథకం విజయవంతమవుతోందని తెలిపారు. దేశంలో వ్యవసాయ ఎగుమతులు రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ రైతులు 2020-21లో 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 33 కోట్ల ఉద్యాన వన పంట ఉత్పత్తులను పండించారని ప్రస్తావించారు.
11 కోట్ల మంది రైతులు రూ. 1.80 లక్షల కోట్ల మేర ప్రధాన మంత్రి కిసాన్ యోజన ద్వారా లబ్ధి పొందారని, వ్యవసాయ రంగంలో భారీ మార్పులు కనిపించాయని ప్రస్తావించారు.
433 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వం సేకరించిందని, దీని వల్ల 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ‘వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి 1,000 పథకాలకు సుమారు రూ. 1 లక్ష కోట్లు మంజూరయ్యాయి..‘ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
‘సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు ఉన్న 'అంత్యోదయ' ప్రాథమిక మంత్రాన్ని ఈ ప్రభుత్వం విశ్వసిస్తోంది. పీఎం ఆవాస్ యోజన, పీఎం స్వానిధి, హర్ ఘర్ జల్, పీఎం స్వామిత్వ వంటి పథకాలు దేశవ్యాప్తంగా పౌరులకు గొప్పగా ఉపయోగపడుతున్నాయి..’ అని రాష్ట్రపతి వివరించారు.
12.45కు ఆర్థిక సర్వే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ మధ్యాహ్నం లోక్ సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ముందుగా లోక్ సభలో, తదుపరి రాజ్యసభలో ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదాపడనుంది.