Bill Gates Resume | ఇది బిల్ గేట్స్ ఫస్ట్ రెజ్యుమే..
ప్రపంచ కుబేరుడుగా పేరుగాంచిన బిల్ గేట్స్ కూడా కెరియర్ మొదట్లో ఉద్యోగ ప్రయత్నాలు భారీగానే చేశారు. అందుకోసం ఒక రెజ్యుమేను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పటి రెజ్యుమేను తాజాగా తన లింక్డ్ ఇన్‌లో బిల్ గేట్స్ పోస్ట్ చేశారు.. చూడండి ఆ ఒక్క పేజ్ రెజ్యుమే ఎంత సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉందో..!
దిగ్గజ టెక్నాలజీ సంస్థ, ఒకప్పుడు ఐటీకి పర్యాయపదమైన మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన సమయంలో అందిపుచ్చుకుని, ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. ఆయన కెరియర్ తొలినాళ్ల నాటి Resume ఎలా ఉందో చూడండి..
Bill Gates Resume : 48 ఏళ్ల క్రితం నాటి రెజ్యుమే..
బిల్ గేట్స్ 1974లో అంటే, 48 ఏళ్ల క్రితం ప్రిపేర్ చేసుకున్న వ్యక్తిగత, వృత్తిగత వివరాలున్న ఉద్యోగ దరఖాస్తు(రెజ్యుమే) ఇది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రెజ్యుమేను పోస్ట్ చేశారాయన. ఆ పోస్ట్‌కు `మీ Resume కచ్చితంగా నా ఈ 48 ఏళ్ల క్రితం నాటి Resume కన్నా బావుంటుంది` అనే ఒక ఫన్నీకాప్షన్ కూడా ఇచ్చారు. క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది. లక్షకు పైగా లైక్స్ సాధించింది. హార్వర్డ్‌లో ఫస్ట్ ఈయర్ చదువుతున్న సమయంలో ఈ Resumeను బిల్‌గేట్స్ ప్రిపేర్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, కంప్యూటర్ గ్రాఫిక్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి తను అప్పటికే చదువుకున్న కోర్సుల వివరాలను అందులో పొందుపర్చారు. తన పూర్తి పేరు అయిన `విలియమ్ హెన్రీ గేట్స్`ను కూడా అందులో పేర్కొన్నారు.
Bill Gates Resume : రెజ్యుమే ప్రిపరేషన్ ఒక ఆర్ట్
ఉద్యోగ సాధనలో Resumeది కీలక పాత్ర. సంస్థకు మొదట మీ గురించి వివరించేది మీ రెజ్యుమేనే. ఆ రెజ్యుమే స్పష్టంగానూ, సృజనాత్మకంగానూ ఉండాలి. ఆ సంబంధిత ఉద్యోగానికి మీరెలా అర్హులో క్లుప్తంగా వివరించాలి. ఆ Resumeలో మీరిచ్చిన సమాచారం నిజాయితీతో కూడినదై ఉండాలి. బిల్ గేట్స్ తొలి రెజ్యుమే లో ఇవన్నీ ఉన్నాయి. అందుకే, ఆ రెజ్యుమే చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లాసిక్‌గా, సింపుల్‌గా, స్ట్రెయిట్‌ఫార్వర్డ్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు. థాంక్స్ ఫర్ షేరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.