2-wheeler sales drop: జూలైలో 5 శాతం పడిపోయిన బజాజ్ టూ వీలర్ సేల్స్
Bajaj Auto 2-wheeler sales drop: బజాజ్ ఆటో కంపెనీ టూ వీలర్ సేల్స్ జూలై నెలలో 5 శాతం పడిపోయాయి. అలాగే ఎంజీ మోటార్ ఇండియా కార్ల అమ్మకాలు కూడా జూలై నెలలో పడిపోయాయి.
ముంబై: బజాజ్ ఆటో జులై 2022లో తన మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 5 శాతం పడిపోయి 3,15,054 యూనిట్లకు చేరుకున్నట్టు సోమవారం తెలిపింది.
పూణేకు చెందిన ఈ వాహన తయారీ సంస్థ గతేడాది జూలైలో మొత్తం 3,30,569 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు జూలై 2022లో 1,56,232 యూనిట్ల నుంచి 5 శాతం పెరిగి 1,64,384 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 1,74,337 యూనిట్లతో పోలిస్తే 14 శాతం తగ్గి 1,50,670 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
జూలైలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించిన కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు గత ఏడాది జూలైతో పోలిస్తే 3% పెరిగి 39,616 యూనిట్లకు చేరుకున్నాయి.
జూలై 2021లో 3,69,116 యూనిట్లతో పోలిస్తే మొత్తం అమ్మకాలు (ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు) ఈ జూలై నెలలో 4 శాతం తగ్గి 3,54,670 వాహనాలకు పడిపోయాయని కంపెనీ తెలిపింది.
2021 ఇదే నెలలో విదేశీ మార్కెట్లలో విక్రయించిన 2,01,843 వాహనాలతో పోలిస్తే జూలైలో మొత్తం ఎగుమతులు (ద్విచక్ర వాహనాలు, కమర్షియల్ వెహికిల్స్) 15 శాతం క్షీణించి 1,71,714 యూనిట్లకు పడిపోయాయని పేర్కొంది.
ఎంజీ మోటార్స్ సేల్స్ పతనం
సప్లై చైన్ అంతరాయాలు ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో జూలైలో 4,013 యూనిట్ల మేర రిటైల్ విక్రయాలు జరిగాయని, అంటే 5 శాతం క్షీణించాయని ఎంజీ మోటార్ ఇండియా సోమవారం నివేదించింది.
గతేడాది ఇదే నెలలో కంపెనీ 4,225 యూనిట్ల రిటైల్ విక్రయాలను నమోదు చేసింది.
సరఫరా పెంపొందించడం, కస్టమర్ డిమాండ్‌ను స్థిరంగా తీర్చడం కోసం పని చేస్తూనే ఉన్నామని, అయితే సప్లై చైన్ పరిమితుల సవాళ్లతో ఉత్పత్తి ప్రభావితమవుతూనే ఉందని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది.
2022 చివరి నాటికి ఎస్‌యూవీ హెక్టర్ కొత్త వెర్షన్‌ను విడుదల చేయడానికి ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే ఉన్న మోడల్‌ను కూడా విక్రయించడం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.