US Shooting: ‘గే’ నైట్ క్లబ్‍లో కాల్పులు.. ఐదుగురు మృతి.. కారణం అదేనా!-attack on us gay night club five killed 18 injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Shooting: ‘గే’ నైట్ క్లబ్‍లో కాల్పులు.. ఐదుగురు మృతి.. కారణం అదేనా!

US Shooting: ‘గే’ నైట్ క్లబ్‍లో కాల్పులు.. ఐదుగురు మృతి.. కారణం అదేనా!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 20, 2022 06:18 PM IST

Shooting at US gay night club: అమెరికాలో మరోసారి దారుణం జరిగింది. ఓ గే నైట్‍క్లబ్‍లో కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

US Shooting: గే నైట్ క్లబ్‍లో కాల్పులు.. ఐదుగురు మృతి
US Shooting: గే నైట్ క్లబ్‍లో కాల్పులు.. ఐదుగురు మృతి (REUTERS)

Shooting at US gay night club: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ గే నైట్ క్లబ్‍లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కొలరాడో (Colorado)లోని ‘క్లబ్ క్యూ’ (Club Q) లో ఈ ఘటన జరిగిందని సీఎన్ఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. కాల్పుల్లో ఐదుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

అర్ధరాత్రి 11.57 గంటల సమయంలో అధికారులకు ఈ ఘటన గురించి కాల్స్ వచ్చాయని కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ ఉన్నతాధికారి పమేలా కాస్ట్రో చెప్పారు. “నిందితుడిగా భావించిన ఓ వ్యక్తిని వారు క్లబ్ లోపల గుర్తించారు. ప్రస్తుతం ఆ అనుమానితుడు కస్టడీలో ఉన్నాడు” అని కాస్ట్రో అన్నారు.

ఈ కాల్పుల ఘటనపై క్లబ్ క్యూ కూడా ప్రకటన విడుదల చేసింది. “మా కమ్యూనిటీపై జరిగిన ఈ తెలివితక్కువ దాడితో ఎంతో వేదన చెందుతున్నాం” అని పేర్కొంది. “దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న ధైర్యవంతమైన కస్టమర్లకు మేం ధన్యవాదాలు చెబుతున్నాం. వారు కట్టడి చేసినందుకే ఈ విద్వేషపూరిత దాడి ఆగింది” అని వెల్లడించింది.

అయితే ఈ దాడి ఎలా మొదలైంది, ఎలా అంతమైందన్న విషయాలను అక్కడి పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను కొలరాడో పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.

Shooting at US gay night club: కారణం ఇదే!

గే కమ్యూనిటీపై విద్వేషంతోనే తుపాకీతో ఓ వ్యక్తి ఈ కాల్పులకు తెగబడినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ నైట్ క్లబ్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. దీన్ని హేట్ అటాక్ అని అభివర్ణించింది. అంటే ‘గే’లపై దీన్ని విద్వేషపూరిత దాడిగా పేర్కొంది.

US Shooting: 2016లోనూ.

2016లో ఫ్లోరిడాలోని ఒర్లాండోలో ఉన్న ఓ గే నైట్‍క్లబ్‍పై భీకర దాడి జరిగింది. ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 49 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు.

IPL_Entry_Point

టాపిక్