East Congo massacre: ఇస్లామిక్ మిలిటెంట్ల మారణహోమం; 36 మంది మృతి..
East Congo massacre: తూర్పు కాంగో లోని ఒక గ్రామంపై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 36 మంది గ్రామస్తుల ప్రాణాలు తీశారు.
East Congo massacre: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లోని ఒక గ్రామంపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తో సంబంధమున్న ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సభ్యలు అర్ధరాత్రి సమయంలో విరుచుకుపడ్డారు. కత్తులు, కొడవళ్లతో గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దాడిలో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన వారు ఎలీడ్ డెమెక్రాటిక్ ఫోర్సెస్ (Allied Democratic Forces ADF) సభ్యులుగా భావిస్తున్నారు. ఆ సాయుధ గ్రూప్ తూర్పు కాంగోలో బలంగా ఉంది. ఈ సంస్థకు అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయి. ఈస్ట్ కాంగోలోని గ్రామాలపై ఈ సాయుధ గ్రూప్ తరచూ దాడులు చేస్తుంటుంది. తుపాకులు, కత్తులు, కొడవల్లతో గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడులు చేస్తుంది.
East Congo massacre: కత్తులు, కొడవళ్లతో..
ఈస్ట్ కాంగో రాజధాని బెనీకి 30కిమీల దూరంలోని ఒయిచా పట్టణం సమీపంలోని ఒక గ్రామంలో ఈ మారణహోమం జరిగింది. ఈ గ్రామంపై ఏడీఎఫ్ గ్రూప్ చేసిన దాడిలో కనీసం 36 మంది చనిపోయారని ఈస్ట్ కాంగో ప్రొవిన్షియల్ గవర్నర్ కార్లీ జాంజు ట్విటర్ లో వెల్లడించారు. అయితే, స్థానిక నాయకుడు ముంబెరె లింబడు మృతుల సంఖ్యను 44 గా పేర్కొన్నారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారన్నారు. ఇంకా కొంతమంది గ్రామస్తుల ఆచూకీ తెలియరావడం లేదన్నారు. సాధారణంగా ఏడీఎఫ్ (ADF) గ్రూప్ మాత్రమే తుపాకులతో కాకుండా, కత్తులు కొడవళ్లతో దాడులు చేస్తుంది. అందువల్ల ఈ మారణ హోమం కూడా ఆ గ్రూప్ పనేనని భావిస్తున్నారు.