crime on women | కూరలో ఉప్పు ఎక్కువైందని కాల్చి చంపాడు..
కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని ఒక మామ తన కోడలిపై కాల్పులు జరిపిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బుల్లెట్ గాయంతో ఆ కోడలు అక్కడికక్కడే చనిపోయింది.
వంటకాలు రుచిగా ఉండాలని సాధారణంగా అంతా కోరుకుంటారు. ఉప్పో, కారమో ఎక్కువయితే, ఆ పూటకు సర్దుకుంటారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో ఒక మామ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని సొంత కోడలినే తుపాకీతో కాల్చి చంపాడు.
తుపాకీతో కాల్పులు..
యూపీలోని హర్దోయిలో గఫూర్(80) కుటుంబం నివాసం ఉంటుంది. ఇంట్లో కొడుకు ఇర్షాద్, కోడలు సులేమా, కూతురు తస్లీమా ఉంటారు. గఫూర్ వద్ద ఒక లైసెన్స్‌డ్ గన్ కూడా ఉంది. మంగళవారం రాత్రి గఫూర్ భోజనం చేస్తుండగా, కూరలో ఉప్పు ఎక్కువైందని కోడలిపై మండిపడ్డాడు. తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కోడలు సులేమా అక్కడికక్కడే చనిపోయింది.
దోపిడీ కట్టుకథ
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సులేమాను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరునాడు ఉదయం పోలీసులు గఫూర్‌ను విచారించారు. అయితే, కొందరు దుండగులు తమ ఇంట్లోకి జొరబడి, తమ కోడలిపై కాల్పులు జరిపారని కట్టుకథ అల్లి పోలీసులకు చెప్పాడు గఫూర్. అయితే, గఫూర్ కట్టుకథకు, కొడుకు ఇర్షాద్, కూతురు తస్లీమా చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో.. గఫూర్‌ను కాస్త లోతుగా ప్రశ్నించారు పోలీసులు. దాంతో, వాస్తవం బయటపడింది. గఫూర్ నేరాన్ని ఒప్పుకున్నాడు.
తరచూ గొడవలు
తన తండ్రి గఫూర్‌కు, తన భార్య సులేమాకు మధ్య భోజనం విషయంలో తరచూ గొడవలు అయ్యేవని ఇర్షాద్ పోలీసులకు తెలిపారు. అలా గొడవ అయిన ప్రతీసారి తన తండ్రి పిస్టల్ తీసి బెదిరించేవాడని వివరించాడు. భోజనం విషయంలో, వంటకాల రుచి విషయంలో మామ, కోడళ్ల మధ్య తరచూ వాగ్వాదాలు చోటు చేసుకునేవని ఇరుగుపొరుగు కూడా పోలీసులకు చెప్పారు.
టాపిక్