Joe Biden: సైకిల్ పైనుంచి కిందపడిపోయిన జో బైడెన్… వీడియో వైరల్
Joe Biden falls from bicycle: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ తొక్కుతూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Joe Biden falls: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (79) కిందపడిపోయారు. సైకిల్ తొక్కుతూ ఆగిన తరువాత ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన పక్కన ఉన్న వారు.. ఆయన్ను పైకి లేపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్ హెన్లోపెన్ పార్కులో శుక్రవారం అమెరికా ప్రథమ మహిళ, సతీమణి జిల్ బైడెన్‌తో కలిసి అధ్యక్షుడు సైక్లింగ్‌కు వెళ్లారు. కొంతదూరం సైక్లింగ్ చేసిన తర్వాత ఆయన ఆగారు. ఈ క్రమంలో ఆయన కుడి కాలు సైకిల్ పెడిల్ లో చిక్కిపోవటంతో... కుడివైపు పడిపోయారు. వెంటనే పక్కవారి సాయంతో పైకి లేచారు.
వైట్ హౌస్ ప్రకటన...
ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో అధ్యకుడు బైడెన్ కు గాయాలు కాలేదని... ఎలాంటి వైద్య సాయం కూడా అవసరంలేదని తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొంది.
బైడెన్ ఇలా పడిపోవటంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసినట్లు అయింది. 2020 నవంబర్ లోనూ... బైడెన్ కిందపడటంతో కాలుకు తీవ్ర గాయమైంది. చికిత్స తరువాత ఆయన వ్యక్తిగత వైద్యుడు అప్పట్లో ప్రకటన కూడా చేశారు. బైడెన్ ఎంతో ఆరోగ్యకరమైన, శక్తివంతమైన వ్యక్తి అని అభివర్ణించారు.