Amarnath Yatra: 16 మంది మృతి.. 15వేల మందిని రక్షించిన సైన్యం
Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర మార్గాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 15వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది సైన్యం.
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 15వేల మందిని సైన్యం రక్షించింది. వరదల ధాటికి 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు.
దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి కారణంగా అమర్నాథ్ యాత్ర మార్గాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో అనేకమంది యాత్రికులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 16మంది మరణించారు. కొండచరియలు విరిగిపడకపోయినా, భారీ వర్షాలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం 100మందితో కూడిన నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సైన్యం, సీఆర్పీఎఫ్ దళాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే 15వేలమంది యాత్రికులను అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ అయిన పంచతర్నికి శనివారం ఉదయం తరలించారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు.
Amarnath Yatra cloudburst : రెండు గంటల వ్యవధిలో ఆ ప్రాంతంలో 31ఎంఎం వర్షపాతం నమోదైంది. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిన యాత్రికులు.. అమర్నాథ్ యాత్రలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటనను గుర్తుతెచ్చుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.
"10 నిమిషాల్లో అంతా మారిపోయింది. ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. నా కళ్ల ముందే 8-10మంది గాయపడ్డారు. వరదలతో పాటు బండ రాళ్లు కూడా దూసుకొచ్చాయి. టెంట్లు కొట్టుకుపోయాయి. వంట సామాగ్రి నీటమునిగింది. ఆకస్మిక వరదలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది. మాకు సైన్యం సహాయం చేసింది." అని ఓ యాత్రికుడు వివరించాడు.
వర్షం పడుతున్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు ఐటీబీపీ వెల్లడించింది. తాజా పరిణామాలతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు వివరించింది.
సంబంధిత కథనం
టాపిక్