Amarnath Yatra : రెండో రోజూ నిలిచిన అమర్ నాథ్ యాత్ర, చిక్కుకున్న 200 మంది తెలుగు యాత్రికులు-amarnath yatra from jammu suspended second day due to inclement weather 200 telugu yatris stuck ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra : రెండో రోజూ నిలిచిన అమర్ నాథ్ యాత్ర, చిక్కుకున్న 200 మంది తెలుగు యాత్రికులు

Amarnath Yatra : రెండో రోజూ నిలిచిన అమర్ నాథ్ యాత్ర, చిక్కుకున్న 200 మంది తెలుగు యాత్రికులు

Bandaru Satyaprasad HT Telugu
Jul 08, 2023 03:08 PM IST

Amarnath Yatra : భారీ వర్షం కారణంగా జమ్ము-శ్రీనగర్ హైవేపై కొండచెరియలు విరిగిపడ్డాయి. దీంతో అమర్ నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు నిలిపివేశారు. పంచతర్ణి ప్రాంతంలో 1500 మంది యాత్రికులు చిక్కుకున్నారు, వీరిలో 200 తెలుగు వారు ఉన్నట్లు సమాచారం.

అమర్ నాథ్ యాత్ర
అమర్ నాథ్ యాత్ర

Amarnath Yatra : ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్‌ యాత్ర వరుసగా రెండో రోజూ నిలిచిపోయింది. భారీ వర్షాలతో జమ్ము- శ్రీనగర్‌ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పహల్గాం, బల్తాల్‌ రెండు మార్గాల్లోనూ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంపుల్లోనే వేలమంది యాత్రికులు ఉండిపోయారు. అమర్ నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. పంచతర్ణి ప్రాంతంలో సుమారు 1,500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 200 మంది వరకూ తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ అమర్‌నాథ్‌ మంచు శివలింగాన్ని 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 31తో అమర్ నాథ్ యాత్ర ముగియనుంది.

కొండచరియలు విరిగిపడడంతో

రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, రహదారి కొట్టుకుపోవడంతో శనివారం ఉదయం జమ్మూ సిటీ నుంచి అమర్‌నాథ్ తీర్థయాత్ర నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారం ఉదయం భగవతి నగర్‌లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారీ వర్షాలు, కశ్మీర్‌లో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్ నాథ్ యాత్రకు ఇవాళ కొత్త బ్యాచ్‌ను అనుమతించలేదని ఆయన తెలిపారు.

రాకపోకలు బంద్

రాంబన్ జిల్లాలోని మారోగ్ ప్రాంతంలోని మెహద్ ప్రాంతం, సెరి, టన్నెల్ 1, టన్నెల్ 2 సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారి (NH44)పై జమ్మూ కశ్మీర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెహద్‌లో కొండచరియలు విరిగిపడటం బురద కారణంగా రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. నగ్రోటా, జఖేని ఉధంపూర్, క్వాజిగుండ్‌లలో జమ్మూ, శ్రీనగర్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. యాత్రికులను యాత్రి నివాస్, చందర్‌కోట్‌లోని ఇతర లాడ్జిమెంట్ సెంటర్‌లలో, హైవే మార్గంలో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లలో ఉంచామని ఆయన తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో మొఘల్ రోడ్, శ్రీనగర్-సోన్‌మార్గ్ రోడ్లు కూడా మూసుకుపోయాయి.

Whats_app_banner