USA Crime news: క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల బాలుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కిన తండ్రి; ఆ చిన్నారి మృతి-4yearold boy dies after father shoves chilli into his mouth ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa Crime News: క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల బాలుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కిన తండ్రి; ఆ చిన్నారి మృతి

USA Crime news: క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల బాలుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కిన తండ్రి; ఆ చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 04:02 PM IST

క్రమశిక్షణ పేరుతో నాలుగేళ్ల కుమారుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కి, ఆ బాలుడి మరణానికి కారణమైన సింగపూర్ వ్యక్తికి ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన రెండేళ్ల క్రితం సింగపూర్ లో జరిగింది. టాయిలెట్ ఉపయోగించకుండా, బయట మల విసర్జన చేసినందుకు ఆ బాలుడిని తండ్రి ఆ విధంగా రాక్షసంగా శిక్షించాడు.

నాలుగేళ్ల బాలుడి నోట్లో మిర్చీ కుక్కిన తండ్రి
నాలుగేళ్ల బాలుడి నోట్లో మిర్చీ కుక్కిన తండ్రి (UnSplash)

రెండేళ్ల క్రితం, క్రమశిక్షణ పేరుతో తన నాలుగేళ్ల కుమారుడి నోట్లో పచ్చి మిర్చీ కుక్కి, ఆ బాలుడి మరణానికి కారణమైన సింగపూర్ వ్యక్తికి ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన 2022 ఆగస్ట్ లో సింగపూర్ లో చోటు చేసుకుంది.

బయట టాయిలెట్ కు వెళ్లాడని..

చిన్న పిల్లలకు సాధారణంగా టాయిలెట్ ఉపయోగించడంపై చిన్న వయస్సు నుంచే శిక్షణ ఇస్తుంటారు. అలా తన కుమారుడికి కూడా ఆ 38 ఏళ్ల తండ్రి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. 2022 ఆగస్టులో కుమారుడితో కలిసి ఆ తండ్రి సింగపూర్లోని తన ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ 4 ఏళ్ల బాలుడు టాయిలెట్ ఉపయోగించకుండా, బయటే మలవిసర్జన చేశాడు. దాంతో, ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తప్పు చేసిన కొడుకును శిక్షించాలనుకున్నాడు. ఆ బాలుడు ఏడుస్తున్నా, పట్టించుకోకుండా, పచ్చి మిర్చీని బలవంతంగా ఆ బాలుడి నోట్లో కుక్కాడు. ఏడుస్తూ, ఆ బాలుడు గది అంతా పరుగులు పెట్టాడు. తన గొంతు వైపు చూపుతూ సైగలు చేస్తూ కాసేపటికి కుప్పకూలి స్పృహ కోల్పోయాడు.

హుటాహుటిన ఆసుపత్రికి..

తల్లి ఎంత ప్రయత్నించినా బాలుడి పరిస్థితి మెరుగుపడకపోవడంతో అంబులెన్స్ కోసం కాల్ చేసింది. చివరకు తండ్రి ఆ బాలుడిని ఎత్తుకుని సమీపంలోని ఫ్యామిలీ క్లినిక్ కు తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి పల్స్, శ్వాసను కోల్పోయినట్లు సమాచారం. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్షలో మిర్చి ముక్క బాలుడి శ్వాసనాళంలో ఇరుక్కుపోయినట్లు తేలింది. ఆ బాలుడి తల్లిదండ్రులకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేరంపై ఆ బాలుడి తండ్రికి స్థానిక కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. ‘‘మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మీరు ఇలాంటి పద్ధతిని అవలంబించడం సరికాదు’’ అని శిక్ష ప్రకటిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Whats_app_banner