Haryana violence: హరియాణాలో కొనసాగుతున్న ‘బుల్ డోజర్’ న్యాయం; అల్లర్లలో పాల్గొన్న వారి ఇళ్లు, షాపుల కూల్చివేత
Haryana violence: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రారంభించిన ‘బుల్ డోజర్’ న్యాయ ప్రక్రియ.. ఆ తరువాత మధ్య ప్రదేశ్ లోకి, తాజాగా హరియాణాలోకి ప్రవేశించింది. ఇటీవల హరియాణాలోని నూహ్ లో మతపరమైన అల్లర్లకు పాల్పడిన వారు అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులను స్థానిక అధికారులు కూల్చేస్తున్నారు.
Haryana violence: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రారంభించిన ‘బుల్ డోజర్’ న్యాయ ప్రక్రియ.. ఆ తరువాత మధ్య ప్రదేశ్ లోకి, తాజాగా హరియాణాలోకి ప్రవేశించింది. ఇటీవల బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోని నూహ్ లో మతపరమైన అల్లర్లకు పాల్పడిన వారు అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులను స్థానిక అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా, శనివారం నాల్హర్ రోడ్డులోని ఎస్కేహెచ్ఎం మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న 45 షాపులను బుల్ డోజర్ తో కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు గురువారం నుంచి ఈ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.
సీఎం ఆదేశాలతో..
నూహ్ లో మత పరమైన ఘర్షణల్లో పాల్గొన్న వారు అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులను కూల్చేయాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకు బుల్ డోజర్లతో ఆ నిర్మాణాలను కూల్చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ నిర్మాణాలు దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయని తెలిపారు. హరియాణాలోని నూహ్ లో చోటు చేసుకున్న మతపరమైన అల్లర్లలో ఇద్దరు హోం గార్డులు, ఒక ఇమాం సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఈ అల్లర్లు ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ కు కూడా విస్తరించాయి. నూహ్ లో ముస్లిం జనాభా ఎక్కువ. హరియాణాలోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ఇది ఒకటి.
గురువారం నుంచి..
కాగా, ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. ఆ రోజు తౌరు పట్టణంలో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలు, ఇళ్లను కూల్చేశారు. మతపరమైన హింసాకాండకు, ఈ కూల్చివేతలకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇది అల్లర్లకు పాల్పడినవారికి విధించే శిక్షలో భాగమేనని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. ‘‘వారికిచ్చే ట్రీట్మెంట్ లో బుల్ డోజర్ కూడా ఒక భాగమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.