Cold Therapy । అలసిన శరీరానికి చల్లటి అనుభూతి.. కోల్డ్ థెరపీ!
Cold Therapy: కోల్డ్ థెరపీ అంటే ఏమిటి? దీని వలన కలిగే ప్రయోజనాలు, కోల్డ్ థెరపీ పొందే విధానాలు ఇక్కడ తెలుసుకోండి.
Cold Therapy Treatment: వేసవి తన ప్రతాపం చూపిస్తుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, మండే ఎండలో అలసిపోయిన శరీరానికి చల్లటి అనుభూతి లభిస్తే ఎంత హాయిగా ఉంటుంది. చల్లటి నీటితో స్నానం (Ice water bath) అలసిన శరీరానికి మంచి చికిత్సను అందిస్తుంది. ఈ రకంగా శరీరానికి చల్లటి చికిత్సను అందించే ప్రక్రియను కోల్డ్ థెరపీ అంటారు. దీనినే కోల్డ్ ఇమ్మర్షన్ (Cold Immersion) లేదా క్రయోథెరపీ (Cryotherapy) అని కూడా పిలుస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఈ కోల్డ్ థెరపీ మంచి ప్రజాదరణ పొందింది. చల్లటి స్నానం చేయడం, మంచు కొలనులో మునిగితేలడం వంటి మార్గాలలో ఈ కోల్డ్ థెరపీని పొందవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
కోల్డ్ థెరపీ చికిత్స శారీరక సమస్యలకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిరూపితమైంది. కోల్డ్ థెరపీ నాడీ వ్యవస్థపై ప్రశాంత ప్రభావాలను చూపుతుంది, మనసుకు ఓదార్పునిస్తుంది, నిరంతరమైన ఆలోచనల నుంచి తలను చల్లబరుస్తుంది, మిమ్మల్ని మానసికంగా తేలిక చేస్తుంది ఈ రకంగా కోల్డ్ థెరపీ మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
తీవ్రంగా వ్యాయామాలు (Intense Exercises) చేసినపుడు, హార్డ్-కోర్ శిక్షణ పొందినపుడు లేదా శరీరం ఎక్కువగా శ్రమకోర్చినపుడు కండరాలలో నొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల వాపులు వేధిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో కూడా కోల్డ్ థెరపీ మీ నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరం చల్లటి అనుభూతికి గురికావడం వలన వాగస్ నాడిని సక్రియం చేస్తుంది, రక్తనాళాలు సంకోచం చెందుతాయి, రక్తప్రసరణ తగ్గుతుంది, హృదయ స్పందన రేటు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో అడిపోనెక్టిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది నొప్పి, వాపులను తగ్గించడంలో సహాయపడే ప్రోటీన్.
Cold Therapy Techniques- కోల్డ్ థెరపీ పొందడం ఎలా
కోల్డ్ థెరపీని పొందడానికి మీరు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో కూడా కోల్డ్ థెరపీ పొందేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.
కోల్డ్ టబ్
ఒక బాత్ టబ్ ను శీతల నీటితో నింపండి, నీరు చాలా చల్లగా ఉండేలా చూసుకోండి. ఆపైన అందులో కొంతసేపు సేదతీరండి. మీకు ఇది సౌకర్యంగా అనిపించకపోతే.. మీకు నొప్పులు, వాపులు ఉన్న ఆ ప్రభావిత ప్రాంతాన్ని మాత్రమే నీటిలో ముంచండి. అయితే ఎక్కువసేపు నీటిలో ఉండకుండా చూసుకోండి.
ఐస్ బాత్
చల్లటి షవర్ తీసుకోండి, శీతల నీటితో షవర్ స్నానం చేయడం వలన ఒళ్లు నొప్పులు మాయం అవుతాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కాకుండా, తక్కువ కాకుండా ఒక 10-15 నిమిషాల పాటు షవర్ స్నానం చేయండి.
ఐస్ మసాజ్
ఐస్ క్యూబ్ లతో శరీరాన్ని 7-10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. కొన్ని ఐస్ క్యూబ్ లను ఒక పేపర్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి మసాజ్ చేయవచ్చు.
కోల్డ్ కంప్రెస్
కోల్డ్ కంప్రెస్ సాంప్రదాయ నొప్పి నివారణ (Pain Relief) మార్గం. ఒక టవల్ ను చల్లటి నీటిలో నానబెట్టి ఆపై దానిని శరీరానికి చుట్టుకోవడం ద్వారా హాయిగా ఉంటుంది. నొప్పులు ఉన్నచోట చుట్టడం ద్వారా ఉపశమనం ఉంటుంది.
కూలెంట్ స్ప్రేలు
మీరు ఈ వేసవిలో ప్రత్యేకంగా ఒళ్లు నొప్పులను తగ్గించుకోవడానికి కూలెంట్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. వీటిలో మెంథాల్ ఉంటుంది. ఇది మీకు శాంత ప్రభావాలను కలిగిస్తుంది.
కోల్డ్-ఇమ్మర్షన్ థెరపీని అందించడానికి క్రియోథెరపీ ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రకాల కోల్డ్ థెరపీల మాదిరిగానే ప్రజలు మంచి అనుభూతి చెందడానికి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అయినప్పటికీ, ఇతర రకాల కోల్డ్ థెరపీల కంటే క్రయోథెరపీకి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి సాంప్రదాయ పద్ధతులలో చికిత్స పొందడం మేలు. అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోల్డ్ థెరపీ చికిత్సలు పొందే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
సంబంధిత కథనం