Summer Gardening Tips । వేసవిలో మీ తోట ఎండిపోకుండా, పచ్చగా ఉండాలంటే ఇవిగో మార్గాలు!
Summer Gardening Tips: ఇంటి ముందు అందమైన తోట ఉంటే ఎంత బాగుంటుంది. పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు ఉంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కానీ వేసవిలో మొక్కలు ఎండిపోతాయి. ఈ ఎండ వేడి నుంచి మీ తోటను సంరక్షించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
Summer Gardening Tips: వేసవి కాలం వచ్చిందంటే మనకు మామిడిపండ్లు గుర్తుకు వస్తాయి, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఎండలను తట్టుకునేందుకు చల్లటి AC లో ఉండాలనిపిస్తుంది. సీజన్ మారే కొద్దీ మన అవసరాలు మారుతుంటాయి. మొక్కలకైనా అంతే! సీజన్ కు తగినట్లుగా మొక్కల పెంపకం ఉండాలి. ఎండాకాలంలో వాటి అవసరాలను గుర్తించి ఆ విధమైన వాతవరణం, పోషణ కల్పించాలి.
ట్రెండింగ్ వార్తలు
వేడి వాతావరణంలో హాయిగా చెట్టునీడలో సేద తీరాలని అనుకున్నపుడు, దాని సంరక్షించడం కూడా మీ బాధ్యత. ఎడాపెడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ప్రతీ ఏడాది వేసవి మరింత మంట పుట్టిస్తోంది. ఆ మంటకు ఇంటి ముందు ఉన్న తోట కూడా ఎండిపోతుంది. ఎండాకాలంలో ఎలాంటి మొక్కలు పెంచాలి, అవి పచ్చగా చిగురించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాలానుగుణ మొక్కలు పెంచండి
మనకు సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు, కూరగాయలు లభిస్తాయి. మొక్కలు కాలానుగుణ జీవులు అని చెప్పటానికి ఇదే ఉదాహారణ. వేసవిలో ఎండను తట్టుకొని నిలబడగలిగే మొక్కలను పెంచాలి. ఈ ఎండాకాలంలో మీ ఇంటి తోటలో మిరపకాయలు, దోసకాయలు, బెండకాయలు, పుచ్చకాయలు వంటి మొక్కలను పెంచుకోవచ్చు. సరిపడా నీరు, సరైన ఎరువును అందించడం ద్వారా ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
సరైన సమయంలో నీరు
మొక్కలకు నీరు పెట్టడం మాత్రమే ముఖ్యం కాదు, అందుకు సరైన సమయం కూడా ఉండాలి. మొక్కలకు ఎప్పుడుపడితే అప్పుడు నీరు పెట్టడం వలన ప్రయోజనం ఉండదు. ఈ వేసవిలో మొక్కలకు నీరు పెట్టడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా సాయంత్రం. ఈ సమయంలో నీరు చల్లగా ఉంటుంది. ఈ నీరు మొక్కలు గ్రహించి, మొక్క ఆరోగ్యంగా పెరుగటానికి, పోషకాలు స్వీకరించటానికి ఉపయోగపడుతుంది.
ఎక్కువ నీరు పెట్టకండి
మొక్కలపై ఒక్కసారిగా నీరు గుమ్మరించకండి, అవి దెబ్బతినవచ్చు. అలాగే ఎక్కువగా నీరు పెట్టడం వలన అవి కుళ్లిపోవచ్చు. నీటి కొరత ఏర్పడినపుడు ఎండిపోవచ్చు. బిందువుల రూపంలో, స్ప్రింక్లర్లు వాడటం లేదా గార్డెనింగ్ బకెట్లతో నీరు పోయడం చేయండి. ఎండాకాలంలో నేల ఎండిపోయినపుడు, ముందు నేలను తేమగా మార్చి ఆపైన నీరు అందించండి. అలాగే మట్టి తొట్టెలు, ట్రేలలో నీరు నిల్వ ఉండకుండా చూడండి, ఎందుకంటే ఇది దోమల వ్యాప్తికి కారణం కాగలదు.
ఆర్గానిక్ కంపోస్ట్ అందించండి
మొక్కలకు నీళ్ళు పోయడంతో పాటు, ఎరువు వేయడం అవసరం. ముఖ్యంగా పండ్ల మొక్కలు, పూలమొక్కలకు ఎరువు కావాలి. మీరు సులభంగా ఇంట్లోనే ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేయవచ్చు. ఇది మొక్కలను హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పూల మొక్కలు
వేసవిలో పూల మొక్కలు మీ ఇంటి తోటకి మంచి రంగులను అందించగలవు. జిన్నియా, బౌగెన్‌విల్లా, బంతిపువ్వులు, గులాబీలు పెంచుకోవచ్చు. ఇవి వేడి వాతారణంలో మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాయి.
నీడను కల్పించండి
చాలా మొక్కలు సూర్యకాంతి నుండి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, పెరుగుతున్న వేడి మొక్కలను వాడిపోయేలా చేస్తుంది. కాబట్టి, వాటికి కాంతి, నీడ రెండూ సమతుల్యంగా లభించే చోటులో పెంచండి. లేదా మొక్కలకు నీడనిచ్చేలా ప్రత్యేకమైన గుడ్డ లేదా వస్త్రాలు లభిస్తాయి, మంచి ఫాబ్రిక్ కొనుగోలు చేసి నీడ కల్పించండి.
ఎండాకాలంలో ఈ చిట్కాలను అనుసరించి మొక్కలు పెంచండి. వారానికి ఒకసారి మీ మొక్కల నుండి వాడిపోతున్న లేదా ఎండిన కొమ్మలు, కొమ్మలు, పువ్వులను సున్నితంగా తొలగించండి. వాటిని బాగా చల్లగా సంరక్షించండి, మీరూ చల్లగా ఉండండి.
సంబంధిత కథనం