Smart Irrigation | మొక్కలకు ఎప్పుడు నీరు అవసరమో ఈ సెన్సార్ వ్యవస్థ పసిగడుతుంది!
పెద్ద విస్తీర్ణంలో తోటలు, పంటలు పెంచుతున్నపుడు అవసరమైన ప్రతీసారి నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ గోవాలోని TERI సెన్సార్ ఆధారిత ఇరిగేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది. దాని వివరాలు చూడండి..
బ్యాంక్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీని ఉపయోగించి సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను గోవాలోని కోర్టాలిమ్ నౌతా సరస్సు వద్ద ఏర్పాటయింది. ఈ టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా వెబ్/మొబైల్ యాప్ ఉపయోగించి నీటిపారుదలను నియంత్రించవచ్చు. దీంతో ఈ ప్రాంతంలో నీరు వృధాగా పోవడం తగ్గిపోయింది. రైతులు తమ పంటలకు, ఉద్యానవనాలకు నీరు అవసరమైనపుడు నేరుగా యాప్ నుంచే నీటి విడుదల చేస్తున్నారు. రిమోట్ సహకారంతోనే సులువుగా ఈ పని నిర్వహంచగలుగుతున్నారు.
తేమ స్థాయి ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. నీటి అవసరం ఉన్నప్పుడు మోటారును ఆన్ చేయవచ్చు. ఒక నిర్ధిష్ట స్థాయికి తేమ చేరుకున్నప్పుడు మోటారు దానంతటదే ఆగిపోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. తేమ శాతాన్ని సెన్సార్లు సేకరించి దానికి అనుగుణంగా మోటారును నియంత్రిస్తాయి.
దీనివల్ల మరోప్రయోజనం ఏమిటంటే పంటలకు పట్టించిన నీరు ఆవిరిగా మారి గాలిలో కలిసిపోదు. ఒకవేళ భూమిలో తేమ తగ్గినపుడు మోటార్ మళ్లీ నీటిని విడుదల చేస్తుంది. దీనివల్ల భూసారం అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. ఈ సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను ఉపయోగిస్తున్న రైతులు ముఖ్యంగా రోజు కూలీపై పని చేసే రైతులు వారి సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. ఈ సమయంలో వారు తమ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయించుకునేందుకు వీలు కలిగినట్లయింది. రైతుల ఆదాయం కూడా పెరిగింది.
ఈ సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) సహకారంతో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (TERI) అభివృద్ధి చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ డ్రివెన్ మిషన్ - వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ కింద ఈ కార్యక్రమానికి సహకారం అందించింది.
రివర్ బ్యాంక్ ఫిల్ట్రేషన్ సాంకేతికతతో పాటు సెన్సార్-నియంత్రిత నీటిపారుదల వ్యవస్థ రైతులకు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. నదులు లేదా సరస్సుల దగ్గర ఉన్న బావుల నుంచి నీటిని సంగ్రహించడం ద్వారా రివర్ బ్యాంక్ ఫిల్ట్రేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్