Breakfasts with Muesli: మ్యూస్లీ తినడం బోర్ కొడితే.. దాంతోనే ఈ 5 అల్పాహారాలు చేసుకోవచ్చు..
Breakfasts with Muesli: మ్యూస్లీని అల్పాహారంగా తినడం కాకుండా.. మ్యూస్లీతోనే రుచికరమైన 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఎలా చేయాలో చూసేయండి.
ఉదయాన్నే అల్పాహారంలోకి చాలా మందికి ఏవైనా ఫ్లేక్స్, సిరియల్స్, ఓట్స్, మ్యూస్లీ తినే అలవాటుంటుంది. అయితే రోజూ మ్యూస్లీలో పాలు పోసుకుని తినడం అంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే మ్యూస్లీని కొత్త పద్ధతుల్లో ఎలా తినొచ్చో తెల్సుకుందాం.
1. క్లాసిక్ మ్యూస్లీ బౌల్:
పాలు లేదా కొద్దిగా చిక్కటి పెరుగు వేసుకుని తినడం సాధారణం. ఒక గిన్నెలో మ్యూస్లీ వేసి, మీద కాస్త వెచ్చగా ఉన్న పాలు, బాదాం పాలు లేదా గ్రీక్ యోగర్ట్ వేసుకొని తినొచ్చు. మీద ఏవైనా ఇష్టమైన పండ్ల ముక్కలు పెట్టుకుని తినేయడమే.
2. మ్యూస్లీ బార్స్:
ఒక గిన్నెలో మ్యూస్లీ తీసుకుని అందులో కొద్దిగా తేనె పోయండి. లేదా ఏదైనా నట్ బటర్ వేసుకోవచ్చు. అందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్, గింజలు ఇంకేవైనా అదనంగా కావాలన్నా వేసుకోవచ్చు. అన్నీ బాగా కలిపి గిన్నెలోనే బార్ లాగా ఒత్తేసి ఫ్రిజ్ లో పెట్టేయాలి. దాన్ని బయటకు తీసి ముక్కల్లా కోసుకుంటే చాలు. మ్యూస్లీ బార్స్ రెడీ.
3. మ్యూస్లీ స్మూతీ:
ఒక బ్లెండర్ లో మ్యూస్లీ, మీకిష్టమైన పండ్లు, పెరుగు లేదా కొద్దిగా పాలు పోసుకోవాలి. అన్నీ కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. ఇష్టాన్ని బట్టి పాలకూర లాంటి ఆకు కూరలు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. దీనివల్ల చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది.
4. ఓవర్ నైట్ ఓట్స్:
మ్యూస్లీని పాలు లేదా యోగర్ట్‌లో కలపాలి. తీపికోసం ఏదైనా స్వీటెనర్ కలుపుకోవచ్చు. బాగా కలిపి మూత పెట్టుకుని రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఉదయాన్నే క్రీమీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ రెడీ అయిపోతాయి. ఉదయాన్నే వాటిలో నానబెట్టిన చియా గింజలు, తేనె కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
5. మ్యూస్లీ ప్యాన్ కేకులు:
ఫుడ్ ప్రాసెసర్ లేదా బ్లెండర్ లో మ్యూస్లీ వేసి పొడిలా చేసేయాలి. ఈ పొడిలో కాస్త ప్యాన్ కేక్ పిండి కలిపి మంచి ప్యాన్ కేకులు వేసుకోవచ్చు. తాజా పండ్లు, పెరుగుతో సర్వ్ చేసుకుంటే మంచి అల్పాహారం సిద్ధం.