Heart-healthy recipes: గుండె బలం పెంచే సలాడ్, చందువా చేపల కూర-hearthealthy recipes to lower cholesterol boost cardiac health including steamed karuppu fish and sprouted mung beans and foxtail millet salad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Hearthealthy Recipes To Lower Cholesterol Boost Cardiac Health Including Steamed Karuppu Fish And Sprouted Mung Beans And Foxtail Millet Salad

Heart-healthy recipes: గుండె బలం పెంచే సలాడ్, చందువా చేపల కూర

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 06:01 PM IST

Heart-healthy recipes: గుండె ఆరోగ్యానికి మేలు చేసే స్ప్రౌట్స్ సలాడ్, చందువా చేపల కూర రెసిపీలు ఇక్కడ చూడొచ్చు.

స్ప్సౌట్స్ సలాడ్
స్ప్సౌట్స్ సలాడ్ (Shutterstock)

యువతలో గుండె పోటు కేసులు పెరిగిపోతున్నాయి. వేగవంతమైన జీవనశైలి కారణంగా వ్యాయామం చేయకపోవడం, పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరాన్ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ గుండెకు మేలు చేసే ఆహారాన్ని ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విభిన్న రకాల ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవాలి. సీజన్ వారీగా లభించే పండ్లు, కూరగాయలు, విత్తనాలు, తృణ ధాన్యాలు, సీ ఫుడ్, చికెన్, గుడ్లు, సాల్మన్, ట్యూనా, బీన్స్, పప్పులు, చిక్కుళ్లు, కొవ్వు తక్కువగా ఉండే పాలు వంటి విభిన్న పోషకాహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇదే సమయంలో అధిక చక్కెరలు, ఉప్పు, శాచ్యురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఉడికించిన, ఆవిరితో వండిన ఆహారాన్ని తీసుకోవాలి.

మై థాలీ, ఆరోగ్య వరల్డ్ సంస్థల్లో పనిచేసే న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘన పాసి గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే రెండు రకాల వంటకాలను సూచించారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.

1. Steamed Karuppu Fish (black pomfret): నల్ల చందువా చేపల కూర

మసాలాలు-తయారు చేసే విధానం: పసుపు, కారప్పొడి, మిరియాలు, ఉప్పు, నిమ్మ రసం కలిపి చేపలు కొద్దిసేపు మారినేట్ కానివ్వాలి. ఆవిరిపై ఉడికించేందుకు చేపలను స్టీమర్‌లో ఆరటి ఆకుపై ఉంచి 7 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి.

సాస్ కోసం కావాల్సినవి: కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కరివేపాకు, నీరుల్లి, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పెప్పర్, ఉప్పు, నిమ్మ రసం. కొబ్బరి కూరను కొబ్బరి నూనెలో వండాలి. ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిరప, టమాటో ప్యూరీ ఒకదాని తరువాత ఒకటి వేసి వేగనివ్వాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు వేయాలి. బాగా ఉడికిన తరువాత కొబ్బరి పాలు పోసి ఇంకాసేపు ఉడకనివ్వాలి.

స్టీమ్డ్ ఫిష్‌పైన ఈ కూరను పోయాలి. బెల్ పెప్పర్స్, క్యారట్, ఆనియన్ రింగ్స్, నిమ్మ కాయతో గార్నిష్ చేయాలి.

Health benefits: చందువా చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలు

పాంఫ్రెట్ ఫిష్ (చందువ చేపలు) ఫ్యాటీ ఫిష్. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడుతాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. చందువ చేపల్లో కాల్షియం, విటమిన్ ఏ, డీ, బీ 12 కూడా ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధకతను పెంచుతాయి. అలాగే మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మపు ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. మెదడు తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా దోహదం చేస్తాయి.

2. Sprouted Mung beans and Foxtail millet salad: పెసర మొలకలు, కొర్రల సలాడ్

కావాల్సిన పదార్థాలు: పెసర మొలకలు, కొర్రలు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే క్యాప్సికం, ఉల్లిగడ్డ, కొత్తిమీర, వేయించిన పల్లీలు, నిమ్మ రసం, చాట్ మసాలా, ఉప్పు

తయారు చేసే విధానం: పెసళ్లు మొలకలు వచ్చేందుకు వీలుగా ఒక రోజు ముందే నానబెట్టాలి. అలాగే కొర్రలను ముందు రోజు రాత్రే నానబెట్టాలి. కొర్రలను స్టీమ్ చేయడం గానీ, ప్రెజర్ కుకర్‌లో గానీ ఉడికించాలి. మొలకలను, మిల్లెట్స్‌ను కలపాలి. అలాగే చిన్నగా తురిమిన ఉల్లి, దోస, టమాట, క్యారట్, పచ్చి మిర్చి ముక్కలు, వేయించిన పల్లీలు, చాట్ మసాలా కలపాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి కలపాలి. తగినంత నిమ్మ రసం కూడా చల్లాలి. సలాడ్ రెడీ అవుతుంది. దీనిని అలాగే వడ్డించొచ్చు. లేదా 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఆ తరువాత వడ్డించవచ్చు.

Health Benefits: పెసర మొలకలు, కొర్రల సలాడ్ ప్రయోజనాలు

పోషకాలతో కూడిన ఈ సలాడ్‌లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంకాలం స్నాక్స్‌గా గానీ తీసుకోవచ్చు. లంచ్, డిన్నర్‌కు ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు. ఈ సలాడ్‌లో విటమిన్ కె, విటమిన్ సీ, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. జీర్ణ క్రియ సాఫీగా సాగేందుకు ఈ సలాడ్ ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫొలెట్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గేలా సాయపడుతుంది.

అలాగే కొర్రల్లో విటమిన్ బీ1 ఉంటుంది. ఇది గుండె విధులకు రక్షణగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అమైనో యాసిడ్లు ఉండడం వల్ల లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ స్తాయి తగ్గుతుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. దీని వల్ల ఆహారం అమితంగా తీసుకోవాలని అనిపించదు. ఇది బరువు తగ్గేందుకు దారితీస్తుంది.

WhatsApp channel