Pre-heart Attack Symptoms। స్త్రీలు మీరు జాగ్రత్త, గుండెపోటుకు ముందు ఈ సంకేతాలు ఉంటాయి!-check pre heart attack symptoms in women that must not ignore ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Check Pre-heart Attack Symptoms In Women That Must Not Ignore

Pre-heart Attack Symptoms। స్త్రీలు మీరు జాగ్రత్త, గుండెపోటుకు ముందు ఈ సంకేతాలు ఉంటాయి!

HT Telugu Desk HT Telugu
Sep 21, 2022 10:39 PM IST

ఈ కాలంలో ఎవరికి, ఎప్పుడు గుండెపోటు వస్తుందో ఊహించలేం. స్త్రీలు కూడా చాలా మంది గుండె జబ్బుల బారినపడుతున్నారు. గుండెపోటు వచ్చేముందు ఈ సంకేతాలు (Pre-heart Attack Symptoms) ఉంటాయి.

Pre-heart Attack Symptoms
Pre-heart Attack Symptoms (Unsplash)

ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు నిశ్చలమైన జీవనశైలి, జన్యు లోపాలు కారణం కావొచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే సంకేతాల (Pre-heart Attack Symptoms) గురించి నిపుణులు తెలియజేశారు. మీరు ఇలాంటి లక్షణాలను గమనిస్తే, వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

చేతుల్లో బలహీనత

డాక్టర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ, గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం కూడా జరగవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. మీరు ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు.

అస్పష్టమైన మాట

కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్న మాటను చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

మానసిక గందరగోళం

మీరు అకస్మాత్తుగా గందరగోళానికి గురైతే, మీరు ఎక్కడ ఉన్నారు,మీ చుట్టూ ఏమి జరుగుతోందో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఉంటే జాగ్రత్త. ఇలాంటి సందర్భంలో మీకు మైకంగా, అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమవుతుంది. మీరు నీరసంగా ఉంటారు. మత్తులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ మీరు ఆల్కహాల్ తాగకపోయినా, మత్తులో లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.

నిరంతరమైన తలనొప్పి

అమెరికన్ హార్ట్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం, దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని అనుభవించవచ్చు. ఇది మీకు తరచుగా జరిగితే, మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.

ఆగకుండా ఎక్కిళ్ళు

మీకు దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణనదే, భయమేం లేదు. జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకండి.

WhatsApp channel

సంబంధిత కథనం