Rathnam OTT: విశాల్ రత్నం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Rathnam OTT: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఈ మూవీ మే 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Rathnam OTT: ఇటీవలే రత్నం మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించాడు విశాల్. యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ హరి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మూవీ మంచి ఓపెనింగ్స్‌ను రాబడుతోంది. నాలుగు రోజుల్లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి 11 కోట్ల వరకు గ్రాస్‌ను... ఐదు కోట్లకుపైగా షేర్‌ను రత్నం మూవీ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
బ్రేక్ ఈవెన్‌లోకి అడుగుపెట్టాలంటే...
తమిళంలో హీరో విశాల్, డైరెక్టర్ హరి కాంబోకు క్రేజ్ భారీగానే ఉన్న ఆశించిన స్థాయిలో రత్నం మూవీ కలెక్షన్స్ సొంతం చేసుకోలేకపోయింది. తమిళంలో నాలుగు రోజుల్లో ఏడు కోట్ల ఇరవై లక్షల వరకు రత్నం మూవీకి కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు వెర్షన్ రెండు కోట్ల ఇరవై లక్షల వరకు వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు దాదాపు నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రత్నం మూవీ రిలీజైంది. విశాల్ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో రెండున్నర కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సివుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
కాగా రత్నం మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దక్కించుకున్నది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. రత్నం మూవీ మే 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మే మూడో వారంలో రత్నం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. రత్నం సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
రత్నం కథ ఇదే...
ఎమ్మెల్యే పన్నీర్‌స్వామికి (సముద్రఖని) రత్నం (విశాల్ ) నమ్మిన బంటుగా పనిచేస్తుంటాడు. ఎమ్మెల్యే అండతో అవినీతి పరుల పని పడుతుంటాడు. రత్నం జీవితంలోకి అనుకోకుండా మల్లిక (ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి వస్తుంది.
మల్లికను చంపడానికి లింగం బ్రదర్స్ ప్రయత్నిస్తుంటారు. కరుడుగట్టిన రౌడీలు అయిన లింగం బ్రదర్స్ బారి నుంచి మల్లికను రత్నం ఎలా కాపాడాడు? రత్నం గత జీవితం మొత్తం కష్టాల మయం కావడానికి కారకులు ఎవరు? తన శత్రువులపై రత్నం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనే పాయింట్‌తో దర్శకుడు హరి రత్నం మూవీని తీర్చిదిద్దాడు.
కథ రొటీన్ కానీ...
కథ రొటీన్ అయినా హరి టేకింగ్, యాక్షన్ , మాస్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. దేవిశ్రీప్రసాద్ బీజీఎమ్ బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో విశాల్, హరి కాంబినేషన్‌లో పూజ సినిమా వచ్చింది. రత్నం వీరిద్దరి కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ.
విశాల్ లాస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి అతడి కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు సింగం సిరీస్ సినిమాలతో పాటు ఆరు, సామీ లాంటి సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌ను అందుకున్నాడు హరి. కానీ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద హరి మ్యాజిక్ పెద్దగా పనిచేయడం లేదు.
ఒకే తరహా టెంప్లేట్ సినిమాలు చేస్తూ ఉండటంతో హరి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ డిజాస్టర్స్ అవుతోన్నాయి. రత్నంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని హరి అనుకున్నారు. కానీ ఈ మాస్ డైరెక్టర్ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు.