Appudo Ippudo Eppudo Trailer: నిఖిల్ సిద్ధార్థ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ విడుదల.. సినిమాకి పెరిగిన హైప్
Nikhil New Movie Trailer: రెండేళ్ల క్రితం పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలు నిరాశపరచడంతో ఢీలా పడిపోయాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత పాత దర్శకుడితో మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
కార్తికేయ-2 తర్వాత మళ్లీ సాలిడ్ హిట్ కోసం చూస్తున్న నిఖిల్ సిద్ధార్థ.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో నవంబరు 8న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు పాటలు ప్రేక్షకులకి ఆసక్తిని పెంచగా.. సోమవారం ట్రైలర్ రిలీజైంది. ఇందులో నిఖిల్ రేసర్ అవ్వాలనుకునే కుర్రాడిగా కనిపించబోతున్నాడు.
మర్డర్‌తో కథ మలుపు
ట్రైలర్‌ను చూస్తే ఎక్కువ శాతం సినిమా షూటింగ్ విదేశాల్లో.. రిచ్‌గా తీసినట్లు అనిపిస్తోంది. హీరోయిన్లు దివ్యంశ కౌశిక్, రుక్మిణి వసంత్‌లతో ట్రైయాంగిల్ లైవ్ స్టోరీ, డేటింగ్ వ్యవహారాలు ఆసక్తిని పెంచుతుండగా.. హీరో మర్డర్ కేసులో ఇరుక్కోవడం మలుపుగా అనిపిస్తోంది. కమెడియన్లు సత్య, వైవా హర్ష ఉండటంతో కామెడీకి ఢోకా ఉండకపోవచ్చు.
మర్డర్ కేసులో నిఖిల్ ఎలా ఇరుక్కున్నాడు? ఆ మర్డర్‌కి విలన్ గ్యాంగ్‌కి ఏంటి సంబంధం? పోలీసులు ఎందుకు నిఖిల్‌ను టార్గెట్ చేశారనే సస్పెన్స్‌గా ఉంచేస్తూ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కట్ చేసింది. కార్తికేయ-2 తర్వాత వరుసగా 18 పేజీస్, స్పై సినిమాలు నిరాశపరచడంతో నిఖిల్‌కి ఇప్పుడు సాలిడ్ కావాల్సి ఉంది.
ఏడేళ్ల తర్వాత సుధీర్ వర్మతో
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాకి సుదీర్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇప్పటికే నిఖిల్ - సుధీర్ వర్మ కాంబినేషన్‌లో స్వామిరారా, కేశవ సినిమాలు వచ్చాయి. దాంతో మూడోసారి మళ్లీ ఈ జోడి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలంటే నవంబరు 8 వరకు ఆగాల్సిందే. 2013లో స్వామిరారా సినిమా రిలీజ్ అవగా.. 2017లో కేశవ వచ్చింది. దాంతో దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిశారు.
కార్తికేయ-2 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అవ్వడంతో.. నిఖిల్ క్రేజ్ కూడా భారీగా పెరిగింది. కానీ.. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలు నిరాశపరచడంతో ఇప్పుడు నిఖిల్‌పై ఒత్తిడి ఉంది.