Vijay Father Chandrasekhar: సీరియల్ ఆర్టిస్ట్‌గా మారిన దళపతి విజయ్ తండ్రి - ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
Vijay Father Chandrasekhar: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ సీరియల్ ఆర్టిస్ట్‌గా మారారు. తమిళంలో రాధికా శరత్‌కుమార్ నిర్మాణంలో ఓ సీరియల్ చేస్తోన్నాడు.
Vijay Father Chandrasekhar: దళపతి విజయ్ ( Thalapathy Vijay)తండ్రి, కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ సీరియల్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఓ సీరియల్‌లో ప్రధాన పాత్రను పోషిస్తోన్నాడు. విజయ్ స్టార్ హీరోగా ఎదగడంలో అతడి తండ్రి చంద్రశేఖర్ పాత్ర ఎంతో ఉంది. దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులో ఎన్నో సినిమాల్ని తెరకెక్కించారు చంద్రశేఖర్. తెలుగులో చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన దేవాంతకుడు, చట్టానికి కళ్లులేవు. పల్లెటూరి మొనగాడు సినిమాలకు చంద్రశేఖర్ దర్శకుడు.
కెరీర్ పీక్స్‌లో ఉన్నసమయంలో తనయుడు విజయ్‌ని హీరోగా నిలబెట్టడం కోసం అతడితో పలు సినిమాలు చేశాడు. వెట్రి సినిమాతో విజయ్‌ని బాల నటుడిగా పరిచయం చేయడమే కాకుండా నాలైయ తీర్పు ద్వారా విజయ్‌ని హీరోగా కోలీవుడ్‌కు చంద్రశేఖర్ పరిచయం చేశారు. విజయ్ స్టార్ హీరోగా మారిన తర్వాత తండ్రిని దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సొంత అవసరాల కోసం తండ్రి తన పేరును ఉపయోగించుకుంటున్నాడంటూ చంద్రశేఖర్‌పై విజయ్ కోర్టు మెట్లెక్కడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
గొప్ప దర్శకుడిగా పేరుతెచ్చుకొన్న చంద్రశేఖర్ తాజాగా సీరియల్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. రాధిక శరత్‌కుమార్ నిర్మాణంలో రూపొందుతోన్న కిజాగు వాసల్ అనే సీరియల్‌లో చంద్రశేఖర్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. నటుడిగా మానాడుతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో చంద్రశేఖర్ కీలక పాత్రల్ని పోషించారు. రాధిక సీరియల్‌తోనే చంద్రశేఖర్ బుల్లితెరపై ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫొటోలను రాధిక శరత్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా చంద్రశేఖర్ సీరియల్స్‌లో నటించడంపై విజయ్ అభిమానులు నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. విజయ్ పేరుప్రతిష్టలకు భంగం కలిగించడానికే అతడి తండ్రి సీరియల్స్‌లో నటిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తోన్నారు.