Tamannaah Bhatia: ఫుల్ ఫామ్‍లో తమన్నా.. మరో బాలీవుడ్ మూవీకి ఓకే
Tamannaah Bhatia: వేదా అనే బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు తాజాగా ఓకే చెప్పింది హీరోయిన్ తమన్నా. వరుస సినిమాలతో మిల్కీ బ్యూటీ ఫుల్ ఫామ్‍లో ఉంది.
Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి ఫుల్ ఫామ్‍లోకి వచ్చేసింది. టాలీవుడ్‍లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో చేస్తోంది తమన్నా. కోలీవుడ్‍లో సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీ జైలర్ సినిమాలో హీరోయిన్‍గా మెరిపిస్తోంది. ఇటీవలే జైలర్ నుంచి కావాలా ఫస్ట్ సాంగ్ విడుదల కాగా.. మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ దుమ్ము రేపింది. ఇండియా షకీరా అంటూ ఆమెను చాలా మంది పొడిగేస్తున్నాయి. అలాగే, ఇటీవల జీ కర్దా అనే వెబ్ సిరీస్‍లో బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరించింది తమన్నా. ఈ సిరీస్‍లో శృంగార సన్నివేశాలు చేసింది తమన్నా. లస్ట్ స్టోరీస్-2లోనూ బోల్డ్ సీన్స్ చేసింది. కాగా, తాజాగా మరో బాలీవుడ్ సినిమాకు తమన్నా ఓకే చెప్పింది.
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘వేదా’ (Vedaa) చిత్రంలో తమన్నా నటించనుంది. నిఖిల్ అద్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. రాజస్థాన్‍లో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో హీరోయిన్ శార్వరీ వాఘ్ ఉంది. ఇప్పుడు తమన్నా కూడా జాయిన్ అయింది.
వేదా మూవీలో అవకాశం రావడం పట్ల తమన్నా స్పందించింది. “నిఖిల్ స్టోరీ చెప్పే విధానం నాకు ఎప్పుడూ నచ్చుతుంది. నేను, జాన్ అబ్రహాం కలిసి తొలిసారి నటించబోతున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నా” అని తమన్నా వెల్లడించింది. “తమన్నా ఎప్పుడూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్పెషల్ రోల్ కోసం నేను ఆమెను సంప్రదించినప్పుడు, చాలా సంతోషించింది. ఈ సినిమా కోసం నా విజన్‍ను ఆమె వెంటనే నమ్మింది. ఆమె రావడం పట్ల ననా టీమ్, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాం” అని దర్శకుడు నిఖిల్ చెప్పాడు.
వేదా చిత్రాన్ని జీ స్టూడియోస్, ఇమాయ్ ఎంటర్‌టైన్‍మెంట్స్, జేఏ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
భోళా శంకర్, జైలర్ సినిమాలతో పాటు మరో రెండు చిత్రాల్లోనూ తమన్నా నటిస్తోంది. ఇప్పుడు ఈ వేదా సినిమాను కూడా అంగీకరించింది.