Taapsee Pannu | మహేష్ వదులుకున్నడేట్‌కు తాప్సీ వస్తుంది…
తాప్పీ తెలుగులో సినిమా చేసి మూడేళ్లు దాటిపోయింది. బాలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో వైపు రావడమే తగ్గించింది. లాంగ్ గ్యాప్ తర్వాత ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాతో తాప్సీ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు..
తాప్సీ కెరీర్ తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ సొగసరి. ఆ తర్వాత వస్తాడు నా రాజు, మొగుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ పరంగా తప్పితే నటిగా ఈ సినిమాలేవి ఆమెకు పేరుతెచ్చిపెట్టకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ‘బేబీ’ సినిమాతో తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను నిరూపించుకున్న తాప్పీ ఫుల్ బిజీ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్, బయోపిక్‌లలో నటిస్తూ హీరోయిన్‌గా నిలదొక్కుకొంది. బాలీవుడ్ గడప తొక్కిన తర్వాత అడపాదడపా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది తాప్సీ. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాసఆత్రేయ’ ఫేమ్ ఆర్.ఎస్.జే స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో ముగ్గురు బాలల జీవితాలతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాప్పీ కీలక పాత్ర చేయబోతున్నది. ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. తొలుత ఈ తేదీన మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ విడుదలకావాల్సిఉంది. కానీ థర్డ్ వేవ్ ప్రభావంతో టాలీవుడ్ నిర్మాతల మధ్య జరిగిన సర్ధుబాటుల కారణంగా మహేష్ బాబు మే నెలలోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 1న ఖాళీ ఏర్పడటంతో ఆ తేదీన తాప్పీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన వారం తర్వాత వస్తోన్న ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాల్సిందే. ఇటీవలే ‘మిషన్ ఇంపాజిబుల్’ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. సినిమాలోని `ఏద్దాం గాలం` అనే లిరికల్ వీడియోను విడుదలచేశారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.