Pindam Trailer: తెలుగులో సరికొత్త హారర్ మూవీ పిండం.. ఆత్మలు హానీ చేస్తాయా? భయపెడుతున్న ట్రైలర్-sriram kushi ravi pindam movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pindam Trailer: తెలుగులో సరికొత్త హారర్ మూవీ పిండం.. ఆత్మలు హానీ చేస్తాయా? భయపెడుతున్న ట్రైలర్

Pindam Trailer: తెలుగులో సరికొత్త హారర్ మూవీ పిండం.. ఆత్మలు హానీ చేస్తాయా? భయపెడుతున్న ట్రైలర్

Sanjiv Kumar HT Telugu
Dec 07, 2023 02:47 PM IST

Pindam Movie Trailer: తెలుగులోకి వస్తున్న సరికొత్త హారర్ మూవీ పిండం. శ్రీరామ్, ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన పిండం ట్రైలర్ డిసెంబర్ 7న విడుదలైంది. ఈ ట్రైలర్ భయపెడుతూ ఆకట్టుకుంటోంది.

తెలుగు హారర్ మూవీ పిండం ట్రైలర్
తెలుగు హారర్ మూవీ పిండం ట్రైలర్

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులోకి వస్తున్న హారర్ చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా గురువారం పిండం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 3 నిమిషాల 45 సెకన్ల నిడివి గల పిండం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈశ్వరీ రావుతో "మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హాని చేయగలవా?" అంటూ అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది.

చాలా కాలంగా ఎవరూ నివసించని ఓ ఇంట్లోకి కథానాయకుడు శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు "మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు" అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది.

ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా "ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ, ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం." అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. అంతేకాకుండా "దెయ్యాలు మనతో మాట్లాడవు. మనం మాట్లాడేది వింటాయి" అంతే అనే క్యాప్షన్ చూపించి మరింత థ్రిల్‌కు గురి చేశారు.

పిండం కథ ప్రస్తుతంతోపాటు 1990, 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది అని మేకర్స్ తెలిపారు. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుందట. పిండం మూవీ కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండనుందని, ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది.

Whats_app_banner