Samantha: బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంటున్న సమంత
ప్రస్తుతం సమంత (Samantha) మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌తో బిజీగా ఉంది. కిక్‌బాక్సింగ్,థాయ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. ఈ శిక్షణ ఎందుకోసమంటే..
బాలీవుడ్ వెబ్‌సిరీస్ (Bollywood Webseries) కోసం ప్రస్తుతం సమంత మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. 2019లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌తో సమంత బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఇందులో రాజీ అనే తమిళ రెబెల్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో నటించింది. గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా అవసరమైతే విలన్ పాత్రలకు సమంత న్యాయం చేయగలదని ఈ సిరీస్ నిరూపించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో సమంతకు పలు అవకాశాలు వరించాయి.
ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయం రాజ్, డీకేలతో సమంత ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్ కోసం సమంత ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అమెరికన్ స్టంట్ మాస్టర్ సారథ్యంలో కిక్ బాక్సింగ్, బాక్సింగ్, పంచ్‌లు విసరడం లాంటి అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగనున్నట్లు సమాచారం.
క్యారెక్టర్ డిమాండ్ మేరకు శిక్షణ తీసుకోవడానికి సమంత అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. అతడు కూడా ఈ శిక్షణలో భాగం కాబోతున్నట్లు తెలిసింది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ఆధారంగా ఈ బాలీవుడ్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తెలుగులో సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.