Golden Globe Awards 2023: ఆర్ఆర్ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటు
Golden Globe Awards 2023: ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు పాట నామినేట్ కావడంతో తాజాగా అవార్డు దక్కింది. అమెరికా కాలిఫోర్నియా వేదికగా జరుగుతోన్న ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారం లభించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. ఈ వేడుకలో భారతీయ చలన చిత్రం ఆర్ఆర్ఆర్‌కు అవార్డుకు లభించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. కుటుంబంతో సహా వీరంతా అక్కడ సందడి చేశారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌తో పాటు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ పాట ప్రముఖ పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్, రిహనాల సాంగ్స్‌ను అధిగమించి మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కైవసం చేసుకుంది. అవార్డు ప్రకటించిన వెంటనే ఆర్ఆర్ఆర్ టీమ్ సంబురాలు చేసుకుంది. రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తదితరులు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అవార్డును ఎంఎం కీరవాణీ అందుకున్నారు.
ఈ అవార్డు రావడంతో నాటు నాటు సాంగ్ మరో అరుదైన ఘనత కూడా సాధించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొదటి ఆసియా సాంగ్ గా నిలిచింది. అది కూడా భారతీయ చిత్రానికి రావడం, అందులోనూ తెలుగు సాంగ్ కు రావడం విశేషం.
ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకోవడంతో తెలుగు వారే కాకుండా యావత్ భారతీయులు తమ సంతోషాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
సంబంధిత కథనం