Partner Movie Review: పార్ట్‌న‌ర్ మూవీ రివ్యూ - ఆది పినిశెట్టి, హ‌న్సిక మూవీ ఎలా ఉందంటే?-partner movie telugu review hansika aadhi pinisetty sci fi comedy movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Partner Movie Review: పార్ట్‌న‌ర్ మూవీ రివ్యూ - ఆది పినిశెట్టి, హ‌న్సిక మూవీ ఎలా ఉందంటే?

Partner Movie Review: పార్ట్‌న‌ర్ మూవీ రివ్యూ - ఆది పినిశెట్టి, హ‌న్సిక మూవీ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 06:02 AM IST

Partner Movie Review: ఆదిపినిశెట్టి, హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ పార్ట్‌న‌ర్ ఇటీవ‌ల థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైంటిఫిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...

హ‌న్సిక, ఆదిపినిశెట్టి
హ‌న్సిక, ఆదిపినిశెట్టి

Partner Movie Review: ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty), హ‌న్సిక‌(Hansika), యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ (Tamil Movie) పార్ట్‌న‌ర్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. సైంటిఫిక్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు మ‌నోజ్ దామోద‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? కామెడీ సినిమాతో హ‌న్సిక‌, ఆది పినిశెట్టిల‌కు హిట్ ద‌క్కిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

అమ్మాయి....అబ్బాయిగా మారితే...

శ్రీధ‌ర్ (ఆది పినిశెట్టి) వ్యాపారంలో న‌ష్ట‌పోయి అప్పుల పాల‌వుతాడు. ఇచ్చిన‌ అప్పు తీర్చ‌క‌పోతే శ్రీధ‌ర్ చెల్లిని పెళ్లి చేసుకుంటాన‌ని ఫైనాన్షియ‌ర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ ఆప్పు తీర్చ‌డం కోసం సిటీలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ర‌న్ చేసే త‌న స్నేహితుడు క‌ళ్యాణ్(యోగిబాబు) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు శ్రీధ‌ర్‌.

క‌ళ్యాణ్ టీసీసీఎస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ముసుగులో స్కామ్‌లు, దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. పెద్ద మొత్తంలో శ్రీధ‌ర్‌కు డ‌బ్బు అవ‌స‌రం కావ‌డంతో ఓ సైంటిస్ట్ త‌యారు చేసిన చిప్‌ను దొంగిలించి జాన్ విజ‌య్ అనే వ్య‌క్తికి ఇవ్వ‌డానికి డీల్ కుద‌ర్చుకుంటారు శ్రీధ‌ర్‌. ఆ చిప్ దొంగిలించే క్ర‌మంలో సైంటిస్ట్ చేసిన ప్ర‌యోగం కార‌ణంగా క‌ళ్యాణ్ అమ్మాయిగా (హ‌న్సిక‌) మారిపోతాడు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అమ్మాయిగా మారిన క‌ళ్యాణ్ తిరిగి మ‌ళ్లీ పూర్వ‌పు రూపానికి వ‌చ్చాడా? శ్రీధ‌ర్ ప్రేమించిన డాక్ట‌ర్ (ప‌ల్ల‌క్ ల‌ల్వానీ) అత‌డిని ఎందుకు అపార్థం చేసుకున్న‌ది? ఫైనాన్షియ‌ర్‌తో చెల్లి పెళ్లి కాకుండా శ్రీధ‌ర్ ఎలా అడ్డుకున్నాడు? జాన్ విజ‌య్ బారి నుంచి శ్రీధ‌ర్‌, క‌ళ్యాణ్ ఎలా త‌ప్పించుకున్నారు? అన్న‌దే పార్ట్‌న‌ర్(Partner Movie Review) క‌థ‌.

సైంటిఫిక్ కామెడీ...

పార్ట్‌న‌ర్ సైంటిఫిక్ అంశాల‌తో ముడిప‌డిన కామెడీ మూవీ. సైంటిస్ట్ చేసిన ప్ర‌యోగం కార‌ణంగా ఓ అబ్బాయి...అమ్మాయిగా మార‌డం అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు మ‌నోజ్ దామోద‌ర‌న్ పార్ట్‌న‌ర్ క‌థ‌ను రాసుకున్నాడు.

ఇలాంటి క‌థ‌ల్లో లాజిక్స్‌తో పాటు ప‌ని ఉండ‌దు. కామెడీ ఎంత బాగా రాసుకుంటే సినిమా అంత బాగా ఆడియెన్స్‌ను క‌నెక్ట్ అవుతుంది. కానీ పార్ట్‌న‌ర్‌లో ఆ న‌వ్వుల డోసు మిస్స‌యింది. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సీన్ ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు. కామెడీ పేరుతో ద‌ర్శ‌కుడు చేసిన హ‌డావిడి, క్యారెక్ట‌రైజేష‌న్స్ చేసే అతి స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి.

ట్విస్ట్ వాడుకోలేదు...

పైనాన్షియ‌ర్‌తో శ్రీధ‌ర్ గొడ‌వ‌లు ప‌డ‌టం, క‌ళ్యాణ్‌ను క‌ల‌వ‌డానికి సిటీకి వ‌చ్చే స‌న్నివేశాల‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. సాఫ్ట్‌వేర్ పేరుతో క‌ళ్యాణ్ అండ్ గ్యాంగ్ చేసే మోసాల‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను(Partner Movie Review) చాలా వ‌ర‌కు లాక్కొచ్చాడు ద‌ర్శ‌కుడు. ఆ సీన్స్అన్ని సాగ‌తీత వ్య‌వ‌హారంలా ఉంటాయి. సైంటిస్ట్ ద‌గ్గ‌ర నుంచి చిప్ దొంగిలించ‌డానికి ప్ర‌య‌త్నించే క్ర‌మంలో క‌ళ్యాణ్...హ‌న్సిక‌గా మారిపోయే ట్విస్ట్‌తో సెకండాఫ్‌ఫై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

కానీ ఆ ట్విస్ట్‌ను స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడు డైరెక్ట‌ర్‌. క‌న్ఫ్యూజ‌న్ కామెడీ పేరుతో క‌థ మొత్తాన్ని క‌ల‌గాపుల‌గం చేశాడు. మినిస్ట‌ర్ ఇంట్లో క‌ళ్యాణ్ దాచిన డ‌బ్బు కొట్టేయ‌డానికి శ్రీధ‌ర్ ప్ర‌య‌త్నాలు చేయ‌డం, మ‌రోవైపు శ్రీధ‌ర్‌పై అత‌డి ప్రియురాలు అనుమానే ప‌డే సీన్స్‌తో చివ‌రి వ‌ర‌కు న‌త్త‌న‌డ‌క‌న సినిమా సాగుతుంది. చివ‌ర‌లో వ‌చ్చే కామెడీ ట్విస్ట్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోదు.

యోగి బాబు కామెడీ టైమింగ్...

ప‌స‌లేని క‌థ‌ను త‌న యాక్టింగ్‌తో నిల‌బెట్టేందుకు ఆది పినిశెట్టి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. యోగిబాబు త‌న‌ కామెడీ టైమింగ్ తో ఒకటి రెండు చోెట్ల న‌వ్వించాడు. హ‌న్సిక క్యారెక్ట‌ర్‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. సెకండాఫ్‌లోనే ఆమె ఎంట్రీ ఇస్తుంది. ప‌ల‌క్ ల‌ల్వానీ పాత్ర‌ గెస్ట్ రోల్‌కు ఎక్కువ‌... హీరోయిన్‌కు త‌క్కువ అన్న చందంగా సాగుతుంది.

Partner Movie Review -కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు...

పార్ట్‌న‌ర్ కాన్సెప్ట్ బాగున్నా కామెడీ మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. ఆదిపినిశెట్టి, హ‌న్సిక లాంటి యాక్ట‌ర్స్ ఉన్నా వారిని ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు. ఓవ‌రాల్‌గా ఈ పార్ట్‌న‌ర్ ను భ‌రించ‌డం క‌ష్ట‌మే...

Whats_app_banner