Mahesh Babu Sankranthi Movies: మహేష్ సంక్రాంతి సెంటిమెంట్ - గుంటూరు కారంతో ఏడో సారి బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ!
Mahesh Babu Sankranthi Movies: మహేష్‌బాబుకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసివచ్చింది. మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకు సంక్రాంతికి ఆరు సినిమాలు రిలీజయ్యాయి. గుంటూరు కారంతో ఏడో సారి సంక్రాంతి బరిలో మహేష్ బాబునిలవబోతున్నాడు.
Mahesh Babu Sankranthi Movies: మహేష్‌బాబుకు సంక్రాంతి పండుగ అచ్చొచ్చింది. సంక్రాంతికి రిలీజ్ చేసిన మహేష్ సినిమాలు చాలా వరకు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పటివరకు సంక్రాంతికి ఆరుసార్లు ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్. గుంటూరు కారంతో ఏడోసారి పండుగ బరిలో నిలవబోతున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో మహేష్ గంటూరు కారంపైనే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. మహేష్ సంక్రాంతికి విన్నర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టక్కరి దొంగతో ఫస్ట్ టైమ్
కౌబాయ్ మూవీ టక్కరిదొంగతో కెరీర్ ఫస్ట్ టైమ్ సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించారు మహేష్‌బాబు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో 2002లో రిలీజైన ఈ మూవీ మంచి ప్రయోగంగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్న కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. అలా తొలి సంక్రాంతి మహేష్‌కు చేదు ఫలితాన్నే మిగిల్చింది.
టక్కరి దొంగ రిలీజైన తర్వాత ఏడాదే తొలి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి రిలీజైన ఒక్కడు మూవీ టాలీవుడ్ కల్ట్ క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది. ఒక్కడు సినిమాతో స్టార్ హీరోల లీగ్‌లో మహేష్ చేరిపోయాడు. ఒక్కడు తర్వాత పొంగల్‌కు తొమ్మిదేళ్లు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు మహేష్ బాబు.
మూడు సంక్రాంతులు మూడు సినిమాలు…
2012 నుంచిమూడేళ్లు ఏడాదికో సినిమాతో వరుసగా మూడు సంక్రాతుల బరిలో నిలిచాడు మహేష్. 2012 సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్‌మెన్ రిలీజైంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన బిజినెస్‌మెన్ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఇందులో సూర్యభాయ్‌గా మహేష్ యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.
ఆ తర్వాత ఏడాది సంక్రాంతికి మహేష్, వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజైంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది. 2014 సంక్రాంతి మాత్రం మహేష్‌కు అచ్చిరాలేదు. సుకుమార్ డైరెక్షన్‌లో మహేష్ హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నా కమర్షియల్‌గా మాత్రం ఆశించినంత విజయం దక్కలేదు.
మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత 2020లో మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతికి రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్నది.
ఈ ఆరు సంక్రాంతి సినిమాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు ఉండగా....రెండు మాత్రమే పరాజయం పాలయ్యాయి.
గుంటూరు కారంతో హ్యాట్రిక్...
గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. తన పంథాకు భిన్నంగా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ కథతో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్, పోస్టర్స్‌లో మహేష్ ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్‌లోనే కనిపించారు.
సినిమాలో అంతకుమించి మహేష్ మాసిజం ఉంటుందని టీమ్ చెబుతోంది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో హారిక హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ గుంటూరు కారం మూవీని నిర్మిస్తోన్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో గుంటూరుకారం భారీ బడ్జెట్ మూవీ కావడం గమనార్హం.