Nithiin Thammudu: పవన్ టైటిల్...పవన్ డైరెక్టర్...మరోసారి పవన్‌ను ఫుల్‌గా వాడేసుకుంటున్న నితిన్
Nithiin Thammudu: పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్‌తో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.
Nithiin Thammudu: టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ వీరాభిమానుల లిస్ట్‌లో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. పవన్ కళ్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఏదో ఒక రూపంలో ప్రతి సినిమాలో చాటిచెబుతూనే ఉంటాడు నితిన్. తన కొత్త సినిమాతో మరోసారి తాను పవన్ కళ్యాణ్‌కు సూపర్ ఫ్యాన్ అని నిరూపించాడు . పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు నితిన్.
ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమ్ముడు మూవీ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్నారు.
అక్కాతమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. కథానుగుణంగానే ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న 56వ మూవీ ఇది.
వకీల్‌సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం. వకీల్‌సాబ్ తర్వాత అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే మూవీని ప్రకటించాడు వేణుశ్రీరామ్.
కానీ అనివార్య కారణాల వల్ల అనౌన్స్‌మెంట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌కు ప్యాకప్ పడింది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు నితిన్. డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.