Newsense Web Series Review: న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ - నవదీప్, బిందుమాధవి వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే
Newsense Web Series Review: నవదీప్, బిందుమాధవి ముఖ్య పాత్రల్లో నటించిన న్యూసెన్స్ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ ద్వారా శుక్రవారం రిలీజైంది. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సీరిస్ ఎలా ఉందంటే...
Newsense Web Series Review: నవదీప్(Navadeep), బిందుమాధవి (Bindu Madhavi) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ న్యూసెన్స్. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌కు శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించాడు.
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు? ఆహా ఓటీటీ లో శుక్రవారం రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉంది? నవదీప్, బిందుమాధవి తమ నటనతో మెప్పించారా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
జర్నలిస్ట్ శివ....
మదనపల్లికి చెందిన శివ (నవదీప్) ఓ జర్నలిస్ట్. రిపబ్లిక్ ఛానెల్‌లో పనిచేస్తుంటాడు. ఊళ్లోని సమస్యల్ని తన అవసరాలుగా మార్చుకుంటూ బతికేస్తుంటాడు. నీతి, న్యాయాలతో పనిలేకుండా డబ్బు కోసం వార్తల్ని తనకు నచ్చినట్లుగా మార్చేస్తుంటాడు. మదనపల్లిలో అధికార పార్టీ నాయకుడు కరుణాకర్‌రెడ్డితో (గబ్బర్) పాటు ప్రతిపక్ష లీడర్ నాగిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. శివతో పాటు అతడి మిత్రులు ఎవరి పక్షం ఉండకుండా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ డబ్బులను గడిస్తుంటారు.
లోకల్ ఎలెక్షన్స్ దగ్గర పడుతోన్న సమయంలో కరుణాకర్ రెడ్డికి ఫేవర్‌గా ఉన్న శివ...నాగిరెడ్డి చేసే అక్రమ దందాలను బయటపెడతాడు. ఆ కోపంతో శివపై నాగిరెడ్డి, అతడి అనుచరుడు రాజు దాడిచేస్తారు.ఆ ప్రమాదం నుంచి శివ ఎలా బయటపడ్డాడు? శివ డబ్బు మనిషిగా మారడానికి కారణం ఏమిటి?
సహ జర్నలిస్ట్ లీలాను (బిందుమాధవి), సువర్చల (మహిమ శ్రీనివాస్)లలో శివ ఎవరిని ప్రేమించాడు? మదనపల్లికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఎడ్విన్ (నందగోపాల్)శివపై ఎందుకు పగను పెంచుకున్నాడు? అన్నదే న్యూసెన్స్ సిరీస్(Newsense Web Series Review) కథ.
మీడియా బ్యాక్‌డ్రాప్‌లో..
తెలుగులో మీడియా బ్యాక్‌డ్రాప్‌లో చాలా తక్కువగా సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. రిలీజ్‌కు ముందు నుంచే న్యూసెన్స్ సిరీస్ పట్ల టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడానికి అదొక ప్రధాన కారణమైంది.
ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా పనిచేసే మీడియా పనితీరు ఎలా ఉంటుంది? జర్నలిస్ట్‌లు నిజాలనే రాస్తున్నారా? లేక వాళ్లు రాసింది నిజమని జనాలు నమ్ముతున్నారా అనే అంశాల నేపథ్యంలో పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా దర్శకుడు శ్రీ ప్రవీణ్ న్యూసెన్స్ సిరీస్‌ను తెరకెక్కించారు.
అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్ట్‌లు ఎలా నలిగిపోతుంటారు? నిజానికి, అబద్దానికి మధ్య వారి జీవితం ఏ విధంగా సాగుతుందన్నది రియలిస్టిక్‌గా ఈ సిరీస్‌లో చూపించారు.
మదనపల్లి యాస
మదనపల్లి ప్రాంతంలో 1990 టైమ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సిరీస్ కథను రాసుకున్నట్లు ప్రమోషన్స్‌లో దర్శకుడు తెలిపాడు. ప్రాంతాన్ని మార్చకుండా మదనపల్లి నేపథ్యంలోనే సిరీస్‌ను నడిపించడం ప్లస్సయింది. . ప్రధాన పాత్రధారుల డైలాగ్స్ మొత్తం చిత్తూరు యాసలోనే వినిపిస్తుంటాయి.
నాచురల్ డైలాగ్స్‌తో కథలో లీనమయ్యేలా చేశాడు డైరెక్టర్. హీరో నిరంతరం హీరో ఏదో సంఘర్షణలో కనిపించడం, లోపల మంచితనం ఉన్నా దానికి ముసుగు వేస్తూ బతకడానికి చేసే పోరాటం చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగున్నాయి. ఈ మీడియా కథలో అంతర్లీనంగా మదర్ సెంటిమెంట్ చూపించిన తీరు మెప్పించింది. మీడియా నేపథ్యం ఒక్కటే కాకుండా పాలకులను నమ్మి ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఎలా మోసపోతుంటారో సందేశాత్మకంగా ఈ సిరీస్‌లో చూపించారు.
ఆరు ఎపిసోడ్స్...
ఆరు ఎపిసోడ్స్‌తో న్యూసెన్స్ ఫస్ట్ సీజన్‌ను నడిపించారు డైరెక్టర్. కథ మొదలైన తీరు బాగున్నా...చివరి వరకు అదే ఇంటెన్సిటీతో నడినిపించలేకపోయారు. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. హీరో క్యారెక్టర్ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నడన్నదానిలో క్లారిటీ మిస్సయింది.
రిపీటెడ్ సీన్స్ వచ్చి ఇబ్బందిపెడుతుంటాయి. పొలిటికల్ సీన్స్‌లో డ్రామా సరిగా పండలేదు. శివ, బిందుమాధవి తప్ప మిగిలిన పాత్రధారుల యాక్టింగ్ చాలా చోట్ల ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఎస్ఐ ఎడ్విన్ క్యారెక్టర్ ఎంటరైన తర్వాతే సిరీస్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ సీజన్ ఎండింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. సెకండ్ సీజన్ పట్ల క్యూరియాసిటీ రేకెత్తించే పాయింట్ ఒక్కటి కనిపించలేదు.
నవదీప్ నాచురల్ యాక్టింగ్ ...
శివ అనే జర్నలిస్ట్‌గా సీరియస్‌గా సాగే పాత్రలో నవదీప్ యాక్టింగ్ బాగుంది. సినిమాల్లో చేసిన పాత్రలకు భిన్నంగా కొత్తగా కనిపించాడు. ఇంటెన్స్ రోల్‌లో ఒదిగిపోయాడు. లీలాగా బిందుమాధవి పాత్రకు ఫస్ట్ సీజన్‌లో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. శివ ఫ్రెండ్స్ యాక్టింగ్, వారి డైలాగ్స్ కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి.
Newsense Web Series Review- టైటిల్‌కు తగ్గట్టుగానే....
న్యూసెన్స్ టైటిల్‌కు తగ్గట్లుగానే అర్థం, పర్థం లేకుండా ఆరు ఎపిసోడ్స్‌తో సిరీస్‌ను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. చిత్తూరు నేపథ్యం, యాసతో పాటు నవదీప్ యాక్టింగ్ ఈ సిరీస్‌లో పెద్ద రిలీఫ్‌గా చెప్పవచ్చు. రాత బాగున్నా తీతలోనే చాలా లోపాలు కనిపించాయి.
రేటింగ్: 2.75/5