Inspector Rishi OTT: ఓటీటీలోకి సరికొత్త హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Inspector Rishi OTT Release Date: ఓటీటీలోకి మరో సరికొత్త హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రానుంది. హీరో నవీన్ చంద్ర టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ తాజగా విడుదల చేశారు. మరి ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..
Inspector Rishi OTT Release: హీరో నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తున్న హారర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఈ సిరీసులో నవీన్ చంద్రతోపాటు సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్, సూపర్ నాచురల్ కథతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. దీనికి డైరెక్టర్ నందిని జె.ఎస్ దర్శకత్వం వహించారు. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్‌పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు.
అయితే, తాజాగా ఇన్‌స్పెక్టర్ రిషి ట్రైలర్‌ను (Inspector Rishi Trailer) మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌పై బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ రియాక్ట్ అయ్యారు. క్వీన్ కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర కలిసి నటిస్తున్న సినిమా సత్యభామ. ఇందులో వీరిద్దరూ పెయిర్‌గా నటించారు. సత్యభామ సినిమా సెట్‌లో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ట్రైలర్‌ను చూసి కాజల్ అగర్వాల్ ఇంప్రెస్ అయ్యారు. అనంతరం ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని, నవీన్ చంద్రతో పాటు వెబ్ సిరీస్ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు కాజల్ అగర్వాల్.
ఇదిలా ఉంటే, ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూపొందించింది. అమెజాన్ తమిళ్ ఒరిజినల్ సిరీస్‌గా వస్తున్న ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్‌ను మార్చి 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇక ఇన్‌స్పెక్టర్ రిషి ట్రైలర్ విషయానికొస్తే.. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్తగా వస్తాడు ఇన్‌స్పెక్టర్ రిషి.
ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్స్ పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కాగా హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నవీన్ చంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర ఈ మధ్య ఎక్కువగా ఓటీటీ సినిమాలు, సిరీసులు చేస్తున్నాడు.