Karnataka Ratna to Puneet: పునీత్‌కు మరణానంతరం కర్ణాటక రత్న.. హాజరైన జూనియర్ ఎన్టీఆర్
Karnataka Ratna to Puneet: దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించింది అక్కడి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరయ్యాడు.
Karnataka Ratna to Puneet: కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు మరోసారి ఘనంగా నివాళి అర్పించింది అక్కడి ప్రభుత్వం. అతనికి మరణానంతరం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న అవార్డు ఇచ్చింది. ఈ కార్యక్రమం మంగళవారం (నవంబర్ 1) బెంగళూరులోని విధాన సౌధ ముందు జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కోలీవుడ్ నుంచి రజనీకాంత్ హాజరయ్యారు.
అయితే ఇదే సమయంలో వర్షం కురవడంతో కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతోపాటు జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ కలిసి ఈ అవార్డును పునీత్ భార్య అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్‌కు అందజేశారు. ఈ అత్యున్నత అవార్డు అందుకున్న 9వ వ్యక్తి పునీత్. గతంలో పునీత్ తండ్రి, నటుడు రాజ్‌కుమార్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు.
తండ్రీకొడుకులు ఇలా అత్యున్నత అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి, పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్‌కుమార్ కూడా వచ్చారు. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది.
చిన్నతనం నుంచే సినిమాల్లో ఉన్న పునీత్.. బాలనటుడిగానే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతోపాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ 1992లో కర్ణాటక రత్న అవార్డు అందుకున్న తొలి వ్యక్తి కావడం విశేషం. ఇక కర్ణాటకలోని స్కూలు పుస్తకాల్లోనూ పునీత్‌పై ఓ పాఠం పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడాడు. అహం, అహంకారానికి దూరంగా ఉంటూ యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని గెలిచిన వ్యక్తి పునీత్ అని అన్నాడు. పునీత్ నవ్వులో ఉన్న స్వచ్ఛత మరెక్కడా చూడలేదని చెప్పాడు. ఇక పునీత్ దైవ సమానుడని రజనీకాంత్ అనడం విశేషం.