Amigos Movie Review: 'అమిగోస్'తో కల్యాణ్ రామ్ మరో హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉంది?
Amigos Movie Review: కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం అమిగోస్. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Amigos Movie Review: నందమూరి హీరో కల్యాణ్ రామ్‌కు చాలా రోజుల తర్వాత గతేడాది బింబిసారతో ఓ మంచి హిట్ పడింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన తదుపరి చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అమిగోస్ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. కల్యాణ్ రామ్ ఇందులో త్రిపాత్రాభినయం చేశారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. ముఖ్యంగా డోప్లర్‌గాంగ్ అనే కథాంశంతో సినిమాను రూపొందించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సినిమా- అమిగోస్
దర్శకుడు- రాజేంద్ర రెడ్డి
నటీనటులు- కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తిగిరి తదితరులు
నిర్మాతలు- మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం- జీబ్రాన్
విడుదల- 2023 ఫిబ్రవరి 10
కథ..
సిద్ధార్థ్, మంజునాత్, మైఖేల్ అనే ముగ్గురు డోప్లర్‌గాంగ్‌లు. అంటే రక్త సంబంధం లేకుండా చూసేందుకు అచ్చం ఒకే పోలిలకలతో ఉండే వ్యక్తులు. సిద్ధార్థ్ బిజినెస్ మ్యాన్ కాగా.. మంజునాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మైఖేల్ గ్యాంగ్‌స్టర్. అయితే మైఖేల్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తుంటుంది. వారి నుంచి తప్పించుకుని తనను తాను కాపాడుకునేందుకు సిద్ధార్థ, మంజునాథ్‌లను వాడుకోవాలని చూస్తాడు. మరి మైఖేల్ వల్ల సిద్ధార్థ్, మంజునాథ్ జీవితాలు ఎలా మారాయి? మైఖేల్‌ను ఎన్ఐఏ పట్టుకుందా? అసలు వీరి ముగ్గురు ఎలా కలిశారు? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
బింబిసార లాంటి సోషియో ఫాంటసీ హిట్ తర్వాత విభిన్న తరహా చిత్రానికి ఓటేశారు కల్యాణ్ రామ్. అమిగోస్ కథాంశం పరంగా రొటీన్‌కు బిన్నంగానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలోనే మూస ధోరణిని ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్‌లో వెళ్తుంది. మూడు పాత్రల పరిచయంతో సినిమా గొప్పగా ప్రారంభమైంది. మొదటి 15, 20 నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనయమయ్యేలా చేస్తుంది. కానీ ఆ తర్వాత రెగ్యూలర్ కథనం స్టోరీపై విసుగుతెప్పిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తెలుగులో చాలా సినిమాల్లో వచ్చాయి. ఇంటర్వెల్ మలుపు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అప్పటికే ఆడియెన్స్ బోర్ ఫీలవుతారు.
ఇంక సెకండాఫ్‌లోనూ పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే సాగిపోతుంది. స్క్రీన్ ప్లేలో ఎమోషనల్ యాంగిల్ సరిగ్గా పండదు. ముగ్గురు క్యారెక్టర్లను ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడననిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్టులకు నెరేషన్ థ్రిల్లింగ్, యంగేజింగ్‌గా సాగాలి. కానీ కథనమంతా ముందే ఊహించినట్లు ఉంటుంది. అయితే నందమూరి అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశముంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం కల్యాణ్ రామ్. మూడు పాత్రల్లో అతడు వైవిధ్యాన్ని చూపించాడు. అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. మూడు విభిన్న మేనరిజాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. పర్ఫార్మెన్స్ పరంగా కల్యాణ్ రామ్ ఓ మెట్టు ఎక్కాడనే చెప్పాలి. మైఖేల్ అనే నెగిటివ్ పాత్రలో నందమూరి హీరో మెప్పిస్తాడు. అద్భుతంగా నటించాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్‌కే పరిమితమైంది. కన్నడ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బ్రహ్మాజీ ఫర్వాలేదనిపిస్తాడు. మిగిలిన నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం..
కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఐడియా బాగానే ఉన్నా.. తెరపై ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. ఇలాంటి ప్లాట్‌లకు విభిన్న తరహా నెరేషన్‌ను ఎంచుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా సింపుల్‌గా రెగ్యూలర్ కమర్షియల్ స్క్రీన్ ప్లేను ఎంచుకున్నాడు. నిర్మాణ పరంగా ఉన్నత విలువలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాటోగ్రాఫర్ ఎస్ సౌందర్ రాజన్ పనితనం అక్కడక్కడ కనిపిస్తుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. జీబ్రాన్ పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఏ పాట కూడా గుర్తుపెట్టుకునేంత స్థాయిలో ఉండదు. కానీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే బాలకృష్ణ ఐకానిక్ సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రీమిక్స్ అనుకున్న స్థాయిలో ఉండదు. పాత పాటే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే నందమూరి అభిమానులకు, రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
చివరగా.. అమిగోస్ కాన్సెప్టు బాగానే ఉన్నా.. కథనమే రొటీన్
రేటింగ్- 2.5/5.
సంబంధిత కథనం