House Of Manchus Teaser: హౌస్ ఆఫ్ మంచూస్.. మంచు ఫ్యామిలీ రియాల్టీ షో.. టీజర్ రిలీజ్
House Of Manchus Teaser: హౌస్ ఆఫ్ మంచూస్ అంటూ మంచు ఫ్యామిలీ ఓ రియాల్టీ షోతో వస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ను గురువారం (మార్చి 30) రిలీజ్ చేసింది.
House Of Manchus Teaser: మంచు ఫ్యామిలీలో విభేదాలు అంటూ ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ఏకంగా కొట్టుకునే స్థాయికి దిగజారిపోయారని మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా అభిమానులు భావించారు. అయితే తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, అనవసరంగా దీనిని పెద్దది చేసి చేస్తున్నారని విష్ణు వివరణ ఇచ్చాడు.
అయినా మనోజ్ షేర్ చేసిన ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. మొత్తం మీడియా ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేసింది. అయితే ఇప్పుడీ నెగటివ్ పబ్లిసిటీని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మంచు ఫ్యామిలీ రెడీ అయిపోయింది. ఇండియాలోనే అతి పెద్ద రియాల్టీ షో అంటూ హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో ఓ షో ప్లాన్ చేశాడు మంచు విష్ణు.
దీనికి సంబంధించిన టీజర్ ను గురువారం (మార్చి 30) రిలీజ్ చేశాడు. ఈ టీజర్ మొదట్లోనే మొన్న వైరల్ అయిన మంచు మనోజ్ వీడియోను చూడొచ్చు. ఆ తర్వాత ఈ వీడియోపై మీడియాలో వచ్చిన వార్తలను ఉంచారు. అది అయిపోగానే విష్ణు ఎంట్రీ ఇచ్చాడు. నా పేరు విష్ణు మంచు.. మోహన్ బాబుగారి అబ్బాయిని అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
మోహన్ బాబు, అతని కుటుంబం, వాళ్ల ఇల్లు అంతా ఈ టీజర్ లో చూపించారు. చివర్లో ఇండియాలోనే అతి పెద్ద రియాల్టీ షో హౌస్ ఆఫ్ మంచూస్.. స్ట్రీమింగ్ 2023లోనే అంటూ ముగించారు. అయితే ఈ రియాల్టీ షో ఏంటి? దీని కాన్సెప్ట్ ఏంటి అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఈ టీజర్ ద్వారా అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు.
అమెరికన్ రియాల్టీ షో అయినా ది కర్దాషియాన్స్ లాగే ఈ హౌస్ ఆఫ్ మంచూస్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షో మొత్తం మంచు ఫ్యామిలీ, వాళ్ల వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరగనుంది. ఈ షోను భారీ స్థాయిలో విష్ణు ప్లాన్ చేస్తున్నాడు. విష్ణుయే ఈ షోను ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ కింద ప్రొడ్యూస్ చేయనున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం