Hit 2 Twitter Review: హిట్ - 2 ట్విట్టర్ రివ్యూ - అడివి శేష్‌కు మరో హిట్ దక్కినట్లే...
Hit 2 Twitter Review: అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే...
Hit 2 Twitter Review: టాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు యంగ్ హీరో అడివి శేష్. హ్యాట్రిక్ సక్సెస్‌లతో జోరుమీదున్న అతడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో చేసిన తాజా సినిమా హిట్ -2. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ప్రశాంతి తిపిరినేనితో కలిసి హీరో నాని హిట్-2ను నిర్మించాడు. 2019లో రూపొందిన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా హిట్ -2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే...
హిట్ పార్ట్ వన్ పెద్ద విజయాన్ని సాధించడంతో హిట్ -2పై ప్రారంభం నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సీక్వెల్‌లో అడివిశేష్ హీరోగా నటించడం, చిత్ర నిర్మాణంలో హీరో నాని భాగస్వామిగా వ్యవహరించడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అగ్ర దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదంటూ ప్రచారం జరిగింది. పలు విశేషాల నడుమ హిట్ -2 నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
డ్యూటీని ఎంజాయ్ చేసే ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా అడవిశేష్ ఎంట్రీ ఇచ్చే సీన్స్ సరదాగా ఉన్నాయంటూ నెటిజన్లు చెబుతున్నారు. ధైర్యంతో పాటు కాస్త నోటిదూళ ఎక్కువగా ఉన్న ఆఫీసర్‌గా అడివి శేష్ క్యారెక్టర్‌ను దర్శకుడు శైలష్ కొలను డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్లుగా పేర్కొంటున్నారు.
అనవసరపు సన్నివేశాలతో టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా డైరెక్టర్ ఇన్వేస్టిగేషన్‌లోకి వెళ్లడం బాగుందని అంటున్నారు. సంజన అనే అమ్మాయి శరీర భాగాలు దొరకడం, పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో ఆ బాడీ పార్ట్స్ సంజన ఒక్కదానివే కాదని, చాలా మంది అమ్మాయిలవని తెలిసే సీన్స్‌తో కథ వేగంగా సాగుతుంటుందని చెబుతున్నారు.
సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్...
మహిళా సాధికారతకు సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి వినూత్న పంథాలో దర్శకుడు శైలేష్ కొలను హిట్ 2 కథ రాసుకున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కిల్లర్, అడివి శేష్ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌తో సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుందని అంటున్నారు. ఇంట్రావెల్ ట్విస్ట్‌తో పాటు సెకండాఫ్ వచ్చే మలుపులను దర్శకుడు బాగా రాసుకున్నాడని పేర్కొంటున్నారు.
స్క్రీన్‌ప్లే, బీజీఎమ్‌కు ఈ సినిమాకు హైలైట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. హిట్-2 సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్‌గా చెబుతున్నారు. ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి కనిపిస్తుందని, హీరోతో ఆమె ప్రేమాయణం, లివింగ్ రిలేషన్‌షిప్ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదని అంటున్నారు.
అడవి శేష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్
కథలో చిన్న చిన్న లోపాలున్నా ఇంటెన్స్ యాక్టింగ్‌తో అడవిశేష్ వాటిని కనిపించకుండా చేశారని అంటున్నారు. హీరోగా అడివి శేష్‌కు, నిర్మాతగా నానికి హిట్ -2తో మరో పెద్ద విజయం దక్కడం ఖాయమని చెబుతున్నారు. హిట్-3కి సంబంధించి స్పెషల్ సర్‌ప్రైజ్‌ను క్లైమాక్స్‌లో చూపించినట్లు తెలిసింది.