Bandra Review: బాంద్రా మూవీ రివ్యూ - దిలీప్, తమన్నా మలయాళం గ్యాంగ్‌స్టర్ మూవీ ఎలా ఉందంటే?
Bandra Review: మిల్కీ బ్యూటీ తమన్నా బాంద్రా మూవీతో హీరోయిన్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Bandra Review: తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. బాంద్రా మూవీతో ఫస్ట్ టైమ్ మలయాళంలోకి(Malayalam) ఎంట్రీ ఇచ్చింది తమన్నా. మలయాళ స్టార్ హీరో దిలీప్(Dileep) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అరుణ్ గోపీ దర్శకత్వం వహించాడు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. తమన్నా మలయాళం డెబ్యూ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో మాలీవుడ్ ప్రేక్షకుల్ని దిలీప్, తమన్నా జోడీ ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం...
తారా జానకి కథ...
సాక్షి (మమతా మోహన్ దాస్) ఓ అసిస్టెంట్ డైరెక్టర్. సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న ఆమె మంచి కథ కోసం అన్వేషిస్తుంటుంది. 1980 టైమ్‌లో ఆత్మహత్య చేసుకున్న టాప్ హీరోయిన్ తార జానకి (తమన్నా) కథను వెండితెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అవుతుంది.
తార జానకి ఆత్మహత్యకు కేరళకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆలకు (దిలీప్) సంబంధం ఉందని సాక్షి కనిపెడుతుంది. రాఘవేంద్ర దేశాయ్ (డినో మారియో) అనే మాఫియాడాన్ కమ్ ప్రొడ్యూసర్ బారి నుంచి తప్పించుకోవడానికి ఆల సహాయం కోరుతుంది తార జానకి. షూటింగ్ నుంచి పారిపోయి ఆల ఇంటికి వస్తుంది. తన ఇంట్లోనే తార జానకికి ఆశ్రయం ఇస్తాడు ఆల.
కొద్ది పరిచయంలోనే తార జానకితో ప్రేమలో పడతాడు ఆల. రాఘవేంద్రదేశాయ్‌ని ఎదురించి తార జానకి కోసం ఆల భారీ బడ్జెట్ సినిమాను నిర్మించడానికి సిద్ధపడతాడు. కానీ రాఘవేంద్రదేశాయ్‌కి ఉన్న పలుకుబడి కారణంగా అతడి సినిమా నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురువుతాయి. ఆ అవాంతరాలు దాటుకొని ఆల సినిమాను పూర్తిచేశాడా?
రాఘవేంద్ర దేశాయ్ బారి నుంచి తార జానకిని ఆల ఏ విధంగా కాపాడాడు? తార జానకి ఆత్యహత్య చేసుకుందా? లేదంటే హత్యకు గురైందా? తార జానకితో పాటు ఆల కూడా చనిపోయాడని వచ్చిన వార్తలు నిజమేనా? తన ప్రేమను తార జానకితో ఆల చెప్పాడా? ఆల గత చరిత్ర ఏమిటి? వీర రాఘవన్ (శరత్ కుమార్) అనే ఐపీఎస్ ఆఫీసర్ రివేంజ్‌కు ఆల ఎందుకు సహాయం చేశాడు? అన్నదే బాంద్రా కథ.
అండర్ వరల్డ్ మాఫియా...
బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అండర్ వరల్డ్ మాఫియా కనుసన్నల్లోనే నడుస్తుందని, హిందీ సినిమాల నిర్మాణంలో మాఫియా పెట్టుబడులు పెడుతుందనే కథనాలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీపై మాఫియా ఆధిపత్యం అనే పాయింట్‌ను తీసుకొని ఓ ప్రేమకథతో పాటు గ్యాంగ్‌స్టర్ డ్రామాను అల్లుకుంటూ దర్శకుడు అరుణ్ గోపీ బాంద్రా కథను రాసుకున్నాడు.
1980 బ్యాక్‌డ్రాప్‌లో…
బాలీవుడ్ టాప్ హీరోయిన్‌తో ఓ మాఫియా డాన్ ఎలా ప్రేమలో పడ్డాడు? కష్టాల్లో ఉన్న హీరోయిన్‌కు ఆ డాన్ ఎలా అండగా నిలబడ్డాడన్నది బాంద్రా సినిమాలో చూపించాడు డైరెక్టర్ అరుణ్ గోపీ. ఓ వైపు ప్రేమకథ...మరోవైపు ఆ మాఫియా డాన్ రివేంజ్‌తో పాటు హీరోయిజం, ఎలివేషన్స్‌తో మాస్, క్లాస్ మేళవింపుతో సినిమాను తెరకెక్కించాడు.
హీరోహీరోయిన్ల కథను డైరెక్ట్‌గా మొదలుపెట్టకుండా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దృక్కోణం నుంచి మొదలుపెట్టాలన్న ఐడియా క్యూరియాసిటీని కలిగిస్తుంది. కథ మొత్తం 1980, 90 దశకంలో నడుస్తుంది. అప్పటి నేటివిటీని రియలిస్టిక్‌గా సినిమాలో చూపించాడు.
భిన్నమైన ప్రపంచాలు...
సినిమా, మాఫియా రెండు భిన్నమైన ప్రపంచాలు. వాటికి లింక్ చేసిన విధానం సినిమాలో బాగుంది. సినీ పరిశ్రమలోని ఆధిపత్యధోరణిని అంతర్లీనంగా బాంద్రాలో చూపించారు. ఇండస్ట్రీలో పలుకుబడి కలిగిన ప్రొడ్యూసర్ల డామినేషన్ ఎలా ఉంటుంది? తమకు ఎదురుతిరిగిన వారి కెరీర్‌ను ఎలా నాశనం చేస్తారన్నది ఆలోచనాత్మకంగా ఆవిష్కరించారు.
హీరో ఫ్లాష్‌బ్యాక్...
హీరో పాత్రకు గత చరిత్ర ఉందని, ముంబాయిని గడగడలాండించాడని సినిమాలో అక్కడక్కడ డైరెక్టర్ ప్రస్తావించాడు. అదేమిటన్నది మాత్రం చూపించలేదు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్‌తో సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ సీక్వెల్‌నే హీరో గత చరిత్రను చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రేమకథ నీరసంగా...
సినిమాకు కాస్టింగ్, కథ బాగా కుదిరినా కథాగమనమే నీరసంగా సాగుతుంది. మాఫియా డాన్ కారణంగా తార జానకి ఇబ్బందులు ఎదుర్కొనే సీన్స్‌లో ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదు. తార జానకి, ఆల ప్రేమకథ నీరసంగా సాగుతుంది. వారికెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. లవ్ స్టోరీని అందంగా చూపించే ఛాన్స్ ఉంది. కానీ దర్శకుడు మాత్రం రిస్క్ తీసుకోకుండా రొటీన్ దారిలోనే అడుగులువేశాడు.
లవ్ సీన్స్ మొత్తం పాత సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. మాఫియాను ఎదురించి ఆల సినిమాను నిర్మించే ఎపిసోడ్ సిల్లీగా సాగుతుంది. ఆ సీన్స్ కోసం శరత్‌కుమార్ పాత్రను కథలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా అది ప్రెడిక్టబుల్‌గానే అనిపిస్తుంది. బాంద్రా అనే టైటిల్‌కు సినిమాకు సంబంధం ఉండదు.
తమన్నా అదుర్స్...
ఆల అనే మాఫియా డాన్‌గా దిలీప్ లుక్ బాగుంది. అతడి పాత్రకు సంబంధించి కొన్ని ఎలివేషన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో హీరో క్యారెక్టర్ విషయంలో ఎక్కువగా సస్పెన్స్ మెయింటేన్ చేయడం బెడిసికొట్టింది.
తెలుగులో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన తమన్నాకు ఫస్ట్ మలయాళం సినిమాలో తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపించే అవకాశం దొరికింది. మాఫియా డాన్ కారణంగా సంఘర్షణను ఎదుర్కొనే టాప్ హీరోయిన్‌గా తమన్నా నటన బాగుంది. స్టైలిష్ విలన్‌గా డినో మారియో కనిపించాడు. మమతా మోహన్‌దాస్, శరత్‌కుమార్ గెస్ట్ పాత్రల్లో కననిపించారు.
ఓపికకు పరీక్ష...
బాంద్రా రొటీన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ. కథ బాగున్నా కథనమే నీరసంగా సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతుంది.
టాపిక్