Telangana Backdrop Movies: టాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తోన్న తెలంగాణ కథలు
Telangana Backdrop Movies: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్య కథలు దర్శకనిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. బలగం, దసరాతో పాటుపలు సినిమాలు అంచనాలకు మించి విజయాల్ని సాధించడంతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్ని రూపొందించే ట్రెండ్ పెరిగిపోయింది.
Telangana Backdrop Movies: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలంగాణ నేపథ్య కథాంశాలు సక్సెస్‌కు చిరునామాగా మారిపోయాయి. ఇక్కడి యాసల్ని, భాషల్ని, సంస్కృతుల్ని సంప్రదాయాల్ని తమ కథల ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తూ పెద్ద విజయాల్ని అందుకుంటున్నారు దర్శకరచయితలు. తెలంగాణ నేపథ్యం అంటే ఒకప్పుడు ఆర్ట్ సినిమాలకే పరిమితం అనే వాదన ఉండేది.
మెయిన్ స్ట్రీమ్ సినిమాల్ని తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేయడం అసాధ్యమనే అపోహ ఇండస్ట్రీలో కనిపించేది. కామెడీ పండించడానికో, విలనిజాన్ని చూపించడానికి మాత్రమే తెలంగాణ, యాస, భాషలు ఉపయోగపడతాయనే అనుకునేవారు. ఇప్పుడా ధోరణి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు కూడా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు.
తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అభిమానుల్ని అలరిస్తున్నారు. తెలంగాణ కథలు వందల కోట్ల వసూళ్లను సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటున్నాయి.
అర్జున్‌రెడ్డి, పెళ్లిచూపులతో మొదలు...
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రావడం 1970-80 దశకలోనే మొదలైంది. తెలంగాణ ప్రజల అస్తిత్వపోరాటాన్ని కథావస్తువుగా చేసుకుంటూ నర్సింగరావు, మృణాల్‌సేన్, గౌతమ్ ఘోష్ వంటి దర్శకులు పలు సినిమాల్ని రూపొందించారు. అప్పటి వాణిజ్య సూత్రాలకు భిన్నంగా వాస్తవికతను పెద్దపీట వేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలను ఆర్ట్ సినిమాల కింద జమకట్టారు.
ఈ ప్రచారం మూలంగా కొన్ని వర్గాలకే దిగ్గజ దర్శకుల చేసిన సినిమాలు చేరువయ్యాయి. ఆ తర్వాత శంకర్, ఆర్ నారాయణమూర్తి తో పాటు మరికొందరు దర్శకులు తెలంగాణ ప్రాంత సంస్కృతుల్ని తమ సినిమాలలో చూపించినా ఎక్కువ కాలం ఈ ఒరవడిని కొనసాగించలేకపోయారు. తెలంగాణ ట్రెండ్‌కు కమర్షియల్ వయాబిలిటీ తీసుకొచ్చిన ఘనత నేటితరంలో శేఖర్ కమ్ముల, తరుణ్‌భాస్కర్‌లకే దక్కుతుంది.
తరుణ్‌భాస్కర్ పెళ్లిచూపులు ఈ నగరానికి ఏమైంది, సందీప్ వంగా అర్జున్‌రెడ్డి, శేఖర్ కమ్ముల ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో తెలంగాణ నేపథ్యంలో కమర్షియల్ సినిమా చేయవచ్చని నిరూపించాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమాలు కల్ట్ క్లాసిస్‌లుగా నిలవడంతో తెలంగాణ కథల ట్రెండ్ ఊపందుకుంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రధారులందరూ తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పే సంస్కృతికి ఈ సినిమాను నాంది పలికాయి.
బలగంతో విశ్వవ్యాప్తం...
తెలంగాణ ప్రాంతపు ఆచారాలు, జీవన విధానంలోని వైరుధ్యాల్ని ఆవిష్కరిస్తూ రూపొందిన పలు చిన్న సినిమాలు అంచనాలకు మించి విజయాల్ని సాధించాయి. , బలగం, జాతిరత్నాలు, డీజే టిల్లు నుంచి ఇటీవల విడుదలైన మేమ్ ఫేమస్, పరేషాన్, బేబీ వరకు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిన్న సినిమాలు నిర్మాతలకు రెండు, మూడింతల లాభాల్ని మిగిల్చాయి.
దిల్‌రాజు నిర్మాణంలో వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా తెలంగాణ కల్చర్‌ను విశ్వవ్యాప్తం చేసింది. రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వందకుపైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నది. తెలంగాణ పల్లె సంస్కృతిలోని ఔన్నత్యాన్ని చాటిచెప్పింది.
స్టార్ హీరోలు కూడా...
తెలంగాణ కథలకు ఆదరణ పెరుగుతోండటం స్టార్ హీరోలు కూడా ఈ జోనర్‌లో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. చిరంజీవి వాల్తేర్ వీరయ్యలతో రవితేజ క్యారెక్టర్‌ను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే నడిపించారు డైరెక్టర్ బాబీ. చాలా కాలంగా కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న నానికి దసరా పెద్ద బ్రేక్ ఇచ్చింది. సింగరేణి ప్రాంత కథతో కంప్లీట్‌గా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
వకీల్‌సాబ్ మూవీలో పవన్ కొన్ని సన్నివేశాల్లో తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడి అలరించారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు తెలంగాణ యాసలోనే డైలాగ్స్ రాశారు. రుద్రమదేవి కోసం అల్లు అర్జున్, ఇస్మార్ట్ శంకర్ కోసం రామ్ తెలంగాణ యాసను నేర్చుకున్నారు.
టాపిక్