Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ - తెలంగాణ కల్చర్‌తో రూపొందిన సినిమా ఎలా ఉందంటే
Balagam Movie Review: ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా మార్చి 3న థియేటర్లలో రిలీజ్‌కానుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అగ్ర నిర్మాత దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరించారు.
Balagam Movie Review: తెలంగాణ బ్యాక్‌డ్రాప్, యాస, భాషలు ప్రజెంట్ బాక్సాఫీస్ సక్సెస్ సీక్రెట్‌గా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్య కథాంశాలతో కూడిన సినిమాలు విరివిగా తెరకెక్కుతోన్నాయి. ఆ కోవలో వచ్చిన సినిమానే బలగం.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ దిల్‌రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. బలగం సినిమాతో కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. చావు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Balagam Movie Story - కొమురయ్య కథ…
కొమురయ్య (సుధాకర్‌రెడ్డి)ఊర్లో ఒంటరిగా ఉంటాడు. భారీగానే బలగం ఉన్నాఅందరూ అతడికి దూరంగా బతుకుతుంటారు. కొడుకులు ఐలయ్య, మొగిలయ్యలకు కూతురు లక్ష్మి, ఆమె భర్తకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు ఐలయ్య కొడుకు సాయిలు(ప్రియదర్శి) అప్పుల్లో మునిగిపోతాడు.
పెళ్లిచేసుకొని వచ్చే కట్నం డబ్బులతో అప్పులు తీర్చాలని ప్లాన్‌చేస్తాడు. సాయిలు ఎంగేజ్‌మెంట్ మరో రెండు రోజుల్లో ఉందనగా కొమురయ్య చనిపోతాడు. అతడి చావు వల్ల సాయిలు పెళ్లి వాయదాపడుతుంది. తాతను చివరి చూపు చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్యను(కావ్య కళ్యాణ్ రామ్) సాయిలు ఇష్టపడతాడు.
మరదల్ని పెళ్లి చేసుకుంటే ఆమె ఆస్తి కూడా కలిసివస్తుందని అనుకుంటాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? కొమురయ్య కొడుకులు, కూతురు మధ్య ఉన్న గొడవలకు కారణమేమిటి? కొమురయ్య పిండాన్ని కాకి ఎందుకు ముట్టలేదు? తమ మధ్య ఉన్న మనస్పర్థలను పక్కనపెట్టి కొమురయ్య కుటుంబసభ్యులందరూ ఎలా కలుసుకున్నారు? అన్నదే(Balagam Movie Review) ఈ సినిమా కథ.
అపోహలు, అపార్థాలు...
కుటుంబసభ్యుల మధ్య ఉండే అపోహలు, అపార్థాలు, వాటిని హీరో పరిష్కరించే కథలతో గతంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. బలగం కోర్ పాయింట్ అదే అయినా చావు చుట్టూ ఈ కథను నడిపించి తొలి సినిమాతోనే వైవిధ్యతను చాటుకున్నాడు దర్శకుడు వేణు టిల్లు. ఈ సెన్సిటివ్ పాయింట్ నుంచి కామెడీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ చక్కగా రాబట్టుకున్నాడు.
ఈ ఎమోషన్స్‌కు స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని జోడించి సహజంగా బలగం సినిమాను తెరకెక్కించాడు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ఆప్తులకు దూరం కావడం సరికాదని, కలిసి ఉండటంలోనే సంతోషం ఇమిడి ఉంటుందని చాటిచెప్పారు.
అయినవాళ్లకు దూరంగా పల్లెల్లో ఒంటరిగా జీవితాల్ని గడిపే తల్లిదండ్రుల మనోవేదనను హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. మనుషులు దూరమైనప్పుడే వారి విలువ తెలుస్తుందని, బతికి ఉన్నప్పుడే అయినవాళ్లను ప్రేమగా చూడటంలోనే ప్రేమ, ఆప్యాయత ఉంటాయని సినిమాలో ఆవిష్కరించారు.
కొమురయ్య పాత్రతోనే...
కొమురయ్య పాత్ర పరిచయంతోనే ఈ సినిమా మొదలవుతుంది. అతడి మంచితనాన్ని చాటిచెబుతూనే మనసులో ఉన్న వేదనను ప్రారంభ సన్నివేశాల్లో అర్థవంతంగా ఆవిష్కరించారు దర్శకుడు.
ఆ తర్వాత సాయిలు క్యారెక్టర్‌ను ఎంట్రీ ఇచ్చి అతడి కష్టాల్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరించారు. అప్పుల నుంచి బయటపడటానికి అతడు వేసే ఎత్తులు నవ్విస్తాయి. కొమురయ్య అంత్యక్రియలకు అతడి కొడుకులు, కూతురు ఫ్యామిలీ రావడంతో అసలు కథ మొదలవుతుంది.
తెలంగాణ యాస…
చావు సమయంలో పల్లెటూళ్లల్లో ఉండే తతంగాన్ని రియలిస్టిక్‌గా చూపించారు. వాటి నుంచి లైటర్ వేలో చక్కగా కామెడీని పండించాడు. చావు తర్వాత వచ్చే మూడోరోజు, ఐదో రోజు పిండాలు పెట్టడం, పెద్ద కర్మ లాంటి సన్నివేశాలను ఫిక్షనల్ వేలో కాకుండా నిజంగా ఎలా జరుగుతాయో సహజంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు డైరెక్టర్ వేణు.
కొమురయ్య పిండాన్ని కాకి ముట్టకపోవడానికి గల కారణాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు , డైలాగ్స్ మనసుల్ని కదిలిస్తాయి. చివరకు కుటుంబసభ్యుల్లో మార్పు తీసుకురావడానికి తెలంగాణ కళ బుర్ర కథను నేపథ్యంగా వాడుకున్న సీన్ బాగుంది. తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ సినిమాకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. పాటలు కూడా తెలంగాణ శైలిలోనే సాగడం ప్లస్‌గా నిలిచింది.
పర్‌ఫెక్ట్ యాప్ట్...
సాయిలు పాత్రకు ప్రియదర్శి పర్‌ఫెక్ట్‌గా ఫిట్ గా నిలిచాడు. ప్రతి విషయంలో తన స్వార్థం గురించే ఆలోచించే యువకుడిగా ఫన్, ఎమోషన్స్ కలగలసిన క్యారెక్టర్‌లో అతడి నటన బాగుంది.
ప్రియదర్శి తర్వాత కొమురయ్యగా సుధాకర్‌రెడ్డి నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. అతడి క్యారెక్టర్ నిడివి తక్కువే సినిమా మొత్తం కొమురయ్య పాత్ర చుట్టే తిరుగుతుంది. కొమురయ్య ఫ్యామిలీ మెంబర్స్‌గా మురళీధర్, కావ్య కళ్యాణ్‌రామ్, జయరాం, రూపలక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
Balagam Movie Review -ఆలోచింపజేసే సినిమా...
తెలంగాణ యాస, భాష, సంస్కృతులకు పట్టంకడుతూ సాగే సరికొత్త సినిమాగా బలగం నిలుస్తుంది. 2015లో రిలీజైన కన్నడ మూవీ తిథి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి బలగం సినిమాను రూపొందించినట్లుగా అనిపిస్తుంది. తిథితో ఆర్ట్ సినిమాగా రూపొందితే బలగం సినిమాను కమర్షియలైజ్ చేశారు