Badland Hunters Review: బ్యాడ్‌లాండ్ హంటర్స్ రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన డాన్ లీ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Badland Hunters Review: డాన్ లీ హీరోగా నటించిన సౌత్ కొరియన్ యాక్షన్ మూవీ బ్యాడ్‌లాండ్ హంటర్స్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఆస్కార్‌కు నామినేట్ అయిన సౌత్ కొరియన్ మూవీ కాంక్రీట్ యుటోపియాకు సీక్వెల్‌గా బ్యాడ్‌లాండ్ హంటర్స్ మూవీ తెరకెక్కింది.
Badland Hunters Review: డాన్ లీ (Don Lee) అలియాస్ మా డోంగ్ సియోక్ యాక్షన్ సినిమా లవర్స్‌కు పరిచయం అక్కరలేని పేరు. ట్రైన్ టూ బూసాన్, అవుట్ లాస్, ది రౌండప్‌తో పాటు అతడు హీరోగా నటించిన పలు సౌత్ కొరియన్ యాక్షన్ మూవీస్ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్‌ను అలరించాయి. మార్వెల్ (Marvel) మూవీస్‌లో డాన్ లీ నటించాడు. అతడు హీరోగా నటించిన బ్యాడ్‌లాండ్ హంటర్స్ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హియో మయాంగ్ దర్శకత్వం వహించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన బ్యాడ్‌లాండ్ హంటర్స్ ఎలా ఉందంటే…
డాక్టర్ ప్రయోగాల బారి నుంచి...
భూకంపం కారణంగా సౌత్ కొరియాలోని ఓ ప్రాంతం మొత్తం నాశనం అవుతోంది. ప్రాణాలతో బయటపడిన కొందరు ప్రజలు ఉండేందుకు ఇళ్లు, తాగేందుకు నీరు లేకుండా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ బతుకుతుంటారు. అదే ప్రాంతానికి చెందిన నామ్‌సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. నామ్‌సామ్, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్) మంచి స్నేహితులు. నామ్‌సామ్ కూతురు చనిపోతుంది. ఆమెను కాపాడుకోలేకపోయానని అనుక్షణం నామ్‌సామ్ బాధపడుతుంటాడు. హన్ సునా (రోహ్ జియోంగ్) అనే అమ్మాయిని తన కూతురిగా భావిస్తుంటాడు. హున్ సునాను చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.
ఓ రోజు వారు ఉండే ప్రాంతానికి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులమంటూ కొందరు వస్తారు. సేఫ్ ప్లేస్ అని అబద్ధాలు చెప్పి హన్‌సునాను ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్తారు. ఆమె అమ్మమ్మను చంపేస్తారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే యాంగ్ జీ సు (లీ హీ జూన్) అనే డాక్టర్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపై ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా చేసే అతడి ప్రయోగం వల్ల చాలా మంది భయంకరమైన జాంబీలుగా మారిపోతుంటారు.
హన్‌సునా ప్రమాదంలో పడిందని తెలుసుకున్న నామ్‌సామ్, చోయ్ జీ వాన్ ఆమెను ఆ సైకో డాక్టర్ బారి నుంచి ఎలా కాపాడారు? వారికి లీ యూన్ హో ఎలా సాయపడింది? డాక్టర్‌తో కలిసి పనిచేసిన లీ యూన్ హూ అతడికి వ్యతిరేకంగా మారడానికి కారణం ఏమిటి? చనిపోయిన తన కూతురిని బతికించడానికి డాక్టర్ జీసు ఏం చేశాడు? డాక్టర్ బారి నుంచి హన్ సునా ప్రాణాలతో బయటపడిందా? లేదా అన్నదే బ్యాడ్‌లాండ్ హంటర్ మూవీ(Badland Hunters Review) కథ.
ఆస్కార్ నామినేట్ మూవీకి సీక్వెల్‌గా...
ఈ ఏడాది బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయినా కాంక్రీట్ యుటోపియాకు సీక్వెల్‌గా బ్యాడ్‌లాండ్ హంటర్స్(Badland Hunters Review) మూవీ తెరకెక్కింది. మల్టీజోనర్ మూవీగా హియో మయాంగ్ ఈమూవీని తెరకెక్కించాడు. యాక్షన్, జాంబీ, లవ్‌స్టోరీ పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో బ్యాడ్‌లాండ్ హంటర్స్ సాగుతుంది. కథ రొటీన్ అయినా బ్యాక్‌డ్రాప్, యాక్షన్ అంశాలతో ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. ప్రమాదకర ప్రయోగాలు చేస్తోన్న ఓ డాక్టర్ బారి నుంచి ఓ అమ్మాయిని హీరోలు ఇద్దరు ఎలా కాపాడారు అన్నదే ఈ సినిమా కథ.
సరికొత్త బ్యాక్‌డ్రాప్...
బ్యాడ్‌లాండ్ హంటర్స్(Badland Hunters Review) కథ మొత్తం భూకంపంతో శిథిలమైన నగరం నేపథ్యంలో సాగుతుంది. ఆ సెటప్ మొత్తం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఎక్కువగా గ్రాఫిక్స్‌తోనే ముడిపడి సాగుతుంటాయి. కానీ ఆ ఫీల్ ఎక్కడ కలగకుండా రియలిస్టిక్‌గా సినిమాను మలిచాడు డైరెక్టర్.
బ్యాడ్‌లాండ్ హంటర్స్‌కు యాక్షన్ సీక్వెన్స్‌లు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్‌గా నిలిచాయి. డైరెక్టర్ హియో మయాంగ్ స్వతహాగా స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌ను హై రేంజ్‌లో ఇంటెన్స్‌గా తెరకెక్కించాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే పీక్స్‌లో ఉంటుంది. డాన్ లీ స్టంట్స్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి.
డాన్ లీ యాక్షన్ అదుర్స్...
నామ్‌సామ్‌గా యాక్షన్ రోల్‌లో డాన్ లీ అదరగొట్టాడు. అతడు చేసే స్టంట్స్ వావ్ అనిపిస్తాయి. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డాన్ లీకి ధీటుగా లీహీజూన్ విలనిజం వర్కవుట్ అయ్యింది. మిగిలిన వారి నటన బాగుంది.
Badland Hunters Review - ఫైట్స్ కోసమే...
డాన్ లీ ఫైట్స్ కోసమే బ్యాడ్‌లాండ్ హంటర్స్ చూడొచ్చు. ట్రైన్ టూ బుసాన్ స్థాయిలో కథ, ఎమోషన్స్ మాత్రం వర్కవుట్ కాలేదు.