South First Survey : తెలంగాణలో కాంగ్రెస్ దే ఆధిక్యం, తగ్గనున్న బీఆర్ఎస్ ఓటింగ్- సౌత్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే
South First Pre Poll Survey : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని సౌత్ ఫస్ట్-పీపుల్ పల్స్ సర్వే ప్రకటించింది. బీఆర్ఎస్ కు 10 శాతం ఓట్లు తగ్గుతాయని అంచనా వేసింది.
South First Pre Poll Survey : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని సౌత్ ఫస్ట్-పీపుల్ పల్స్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 57-62 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందుతుందని తెలిపింది. బీఆర్ఎస్ 41-46 సీట్లకే పరిమితం కానునందని అంచనా వేసింది. బీజేపీకి 3-6 సీట్లు, ఏఐఎంఐఎం పార్టీకి 6-7, ఇతరులకు 1-2 స్థానాలు దక్కుతాయని సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది. బీఆర్ఎస్ కంటే దాదాపు 4 శాతం ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వెల్లడించింది.
ఓట్ల శాతం అంచనాలు
- కాంగ్రెస్ -42.5%
- బీఆర్ఎస్ - 37.6%
- బీజేపీ - 13.2%
- ఎంఐఎం- 0.9%
- ఇతరులు- 5.8%
కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ల శాతం
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఓట్ల శాతంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ -42.5 శాతం, బీఆర్ఎస్ - 37.6 శాతం ఓట్లు సాధిస్తుందని తెలిపింది. ఓట్ల శాతంలో తేడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య 4.9 శాతం పాయింట్లుగా ఉందని పేర్కొంది. 2018లో బీఆర్‌ఎస్ ఓట్ల శాతం 47.4 శాతంగా ఉండగా, కాంగ్రెస్‌కు 28.7 శాతం ఉందని తెలిపింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దాదాపు 10 శాతం ఓట్లు తగ్గుతున్నాయని సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది.
మహిళల మద్దతు బీఆర్ఎస్ కు
2018లో 7.1 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి 13.2 శాతం ఓట్లు వస్తాయని సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది. నవంబర్ 15 నుంచి 25వ తేదీ వరకు సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే నిర్వహించారు. స్త్రీలు, ముఖ్యంగా గృహిణులు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని, పురుష ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని సర్వే అంచనా వేసింది. యువత (20-35 సంవత్సరాల వయస్సు) అత్యధికంగా కాంగ్రెస్ వెంటే ఉన్నారని అంచనా వేసింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని యువత భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులను మార్చకపోవడం బీఆర్ఎస్ పై ప్రభావం పడిందని సర్వే తెలిపింది. 40 శాతం మంది ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం రేవంత్ రెడ్డి, 11 శాతం భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నారు.