Gajwel Politics : బీసీ ఓట్లపై ఈటల గురి, గజ్వేల్ లో కేసీఆర్ కు గట్టిపోటీ తప్పదా?-gajwel news in telugu ts elections bjp etela rajender tough fight to kcr ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gajwel Politics : బీసీ ఓట్లపై ఈటల గురి, గజ్వేల్ లో కేసీఆర్ కు గట్టిపోటీ తప్పదా?

Gajwel Politics : బీసీ ఓట్లపై ఈటల గురి, గజ్వేల్ లో కేసీఆర్ కు గట్టిపోటీ తప్పదా?

HT Telugu Desk HT Telugu
Nov 26, 2023 08:00 PM IST

Gajwel Politics : గజ్వేల్ లో హ్యాట్రిక్ పై గురిపెట్టిన కేసీఆర్ కు ఈటల రాజేందర్ గట్టిపోటీ ఇచ్చేలా ఉన్నారు. బీసీ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఈటల రాజేందర్ గురిపెట్టారు.

కేసీఆర్ వర్సెస్ ఈటల
కేసీఆర్ వర్సెస్ ఈటల

Gajwel Politics : వరుసగా రెండుసార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలంటే మాత్రం ఒకప్పటి తన అనుంగు అనుచరుడు, ఇప్పుడు పార్టీ మారి గజ్వేల్ లో తన ప్రత్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ అడ్డంకి దాటాల్సిందే. గత రెండు ఎన్నికల్లో గజ్వేల్ లో తనకు ప్రత్యర్థిగా ఉన్న, వంటేరు ప్రతాపరెడ్డి పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరటం తనకు ఇక్కడ ఎదురే లేదు అనుకుంటున్నా సమయంలో, ఈటల రూపంలో అనుకోని బలమైన ప్రత్యర్థి ఎదురయ్యారు. ఈటల ముఖ్యంగా బీసీ ఓట్ల పైన, బీసీలలో ఎక్కువగా ఉన్న తన కమ్యూనిటీ ముదిరాజులపైన, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. తనకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తూప్రాన్ బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధానమంత్రి సభ తర్వాత, గజ్వేల్ లో పరిస్థితులు పూర్తిగా తనకు అనుకూలంగా మారతాయని ఈటల అంటున్నారు.

గజ్వేల్ బాధ్యతలు వంటేరు ప్రతాప రెడ్డి

అయితే కేసీఆర్ మాత్రం అభివృద్ధినే మంత్రంగా ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ పదే, పదే నియోజకవర్గానికి రాలేని పరిస్థితిలో, వంటేరు ప్రతాప రెడ్డి పూర్తిగా ప్రచార బాధ్యతలు తన భుజాన ఎత్తుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఇతర నాయకులు సహకరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న, తూముకుంట నర్సారెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఎంతవరకు చీలుస్తారు అనేదానిపైన, కేసీఆర్ కు ఈటల రాజేందర్ ఎంత గట్టి పోటీ ఇస్తారనే విషయం ఆధారపడి ఉంటుంది.

గజ్వేల్ బరిలో 44 మంది

వీరి ముగ్గురుతో పాటు, మొత్తం 44 మంది ఎన్నికల బరిలో ఉండటంతో, గజ్వేల్ ఎన్నికలు ఇంకా ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, ఈసారి తాము లక్ష మెజారిటీ పై దృష్టి పెట్టామని చెబుతుంటే, ప్రభుత్వం, కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకతే తమకు లాభాన్ని చేకూరుస్తుందని ఈటల వర్గీయులు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు గ్యారంటీల పైన ప్రధానంగా ఆధారపడుతున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఉన్న, గజ్వేల్ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో 2 లక్షల 74 వేల ఓట్లు ఉన్నాయి. పోలింగ్ రోజు దగ్గర పడుతుండటంతో మూడు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.

Whats_app_banner