Bandi Sanjay: బియ్యం టెండర్లలో 1300 కోట్ల గోల్ మాల్ జరిగిందన్న బండి సంజయ్
Bandi Sanjay: పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ బియ్యం టెండర్లలో రూ.1300 కోట్ల నిధులు గోల్ మాల్ చేశారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
Bandi Sanjay: కరీం నగర్ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డ భూముల్లో బుల్డోజర్ లు దించుతా నని ప్రకటించారు.
కరీంనగర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... బియ్యం టెండర్లలో గోల్ మాల్ కాలేదని, గంగుల కమలాకర్ నిజంగా తప్పు చేయలేదని భావిస్తే…దేవుడి గుడి వద్దకొచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
రేషన్ షాపుల్లో పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం పైసలన్నీ కేంద్రమే భరిస్తోందని చెప్పారు. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోందన్నారు.
వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే ఇస్తోందన్నారు. వీటికి సంబంధించి లెక్కాపత్రంతో వివరాలు తనవద్ద ఉన్నాయని, బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
పౌరసరఫరాల మంత్రిగా ఉంటూ కరీంనగర్ ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు బీసీ బంధు పైసలియ్యలేదన్నారు. వీటిపై తాను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడితే…గంగుల తనను అవినీతిపరుడిగా చిత్రీకరిస్తూ ప్రజలను దారి మళ్లించే కుట్ర చేస్తున్నారన్నారు.
నేను నిజంగా అవినీతికి పాల్పడితే.. ఆ ఆస్తిపాస్తులకు సంబందించిన డాక్యుమెంట్లన్నీ తీసుకురా… అవన్నీ ప్రజలకు రాసిచ్చేస్తానని చెప్పాలని సవాలు చేశారు. గంగుల ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకొస్తే, తాను తీసుకొస్తా అన్నారు. గంగుల ఆస్తుల్ని ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమా?’’ అంటూ ప్రశ్నించారు.
నేను గెలిస్తే…. కబ్జా స్థలాలపై బుల్ డోజర్లు దించుతా
ప్రభుత్వ స్థలాలేమైనా మీ అయ్య జాగీరనుకున్నారా కమలాకర్ అంటు సంజయ్ మండిపడ్డారు... తానెవ్వరికి భయపడనని... బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్ డోజర్లు దించుతానని… వాటిని స్వాధీన పర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతానన్నారు.
కరీంనగర్ లో బిఆర్ఎస్ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు పనిచేసే నాయకులను ఎన్నుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు...
రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా