PM Modi In Jagityal: తెలంగాణను లూటీ చేసే వారిని వదలమన్న మోదీ… కాంగ్రెస్, బిఆర్‌ఎస్ దోపిడీలపై విచారణ చేస్తామన్న మోదీ
PM Modi In Jagityal: తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లలో బిఆర్‌ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందని, రాష్ట్రాన్ని లూటీ చేసే వారిని బీజేపీ వదలదని, మోదీ గ్యారంటీల్లో హామీ ఇస్తున్నట్లు ప్రధాని జగిత్యాలలో ప్రకటించారు.
PM Modi In Jagityal: తెలంగాణలో బీజేపీ బలపడుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, మూడ్రోజుల్లో తెలంగాణ జిల్లాల పర్యటనల్లో ప్రజల ఆదరాభిమానాలు కనిపించాయని చెప్పారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని జగిత్యాల సభలో విశ్వాసం వ్యక్తం చేశారు. “400 దాటాలి, బీజేపీకి ఓటు వేయాలి” అని తెలుగులో పిలుపునిచ్చి ప్రజల్లో ఉత్సాహం నింపారు. మోదీ పిలుపుకు జగిత్యాల సభ మోదీ నినాదాలతో మార్మోగింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గుంటూరులో ఎన్డీఏ ర్యాలీలో పాల్గొన్న మోదీ సోమవారం జగిత్యాలలో బీజేపీ విజయసంకల్స సభలో పాల్గొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
సభా వేదికపై కరీనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంగ్లేయుల పోరాటం, రజాకార్ల ఆగడాలపై పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజానీకానిదని అదే స్ఫూర్తితో ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటే…
బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పదేళ్లుగా వెనుకబడి పోయిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న డబ్బు ఢిల్లీ వరకు చేరుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలంగాణ ఏటిఎంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.
టిఆర్‌ఎస్ మీద ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు మధ్య ఉన్న బంధాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్న విషయం గుర్తుంచు కోవాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం లేదు, కాంగ్రెస్ సమాధానం చెప్పక పోవడాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు మోదీపై నిందలు వేయడం తప్ప మరొకటి తెలియదన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ ఇస్తున్నాడని, తెలంగాణను దోచుకునే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. మోదీ గ్యారంటీల్లో తెలంగాణను లూటీ చేసే వారిని శిక్షించడం కూడా ఉందన్నారు.
నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, కరీంనగర్‌లో బండి సంజయ్, పెద్దపల్లిలో శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. పోలీంగ్ కేంద్రాలకు భారీగా తరలి వెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎక్స్‌లో తన ప్రసంగాలను “నమో ఇన్ తెలుగు” హ్యాండిల్‌లో తెలుగులో వినొచ్చని ప్రధాని మోదీ చెప్పారు. 100శాతం తెలుగులో లేకపోయిన కనీసం 80శాతం అర్థమయ్యేలా ప్రసంగాలు తెలుగులో వినిపిస్తాయని చెప్పారు. తాను దేశంలో ఎక్కడ మాట్లాడినా ఆ ప్రసంగాలు తెలుగులో అందుబాటులో ఉంటాయని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని తెలుగు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
మోదీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు….
మోదీ రాక సందర్భంగా జగిత్యాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్పసభ పేరుతో సభను నిర్వహిస్తున్నారు.
ప్రధాని రాక సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ బలగాలతో పాటు సభ బందోబస్తుకు 1,600 మందికిపైగా పోలీసులను మోహరించారు.సభ జరిగే మైదాన పరిసరాలను పూర్తిగా ఎన్‌ఎస్‌జీ బలగాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పాటు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఐఎస్‌ఐ తదితర ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు పట్టున్న ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
జగిత్యాల విజయసంకల్ప సభకు వర్షం గండం పొంచి ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేవారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు చేయడంతో అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్, కాన్వాయ్ మూమెంట్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు.
జగిత్యాల పట్టణంలోని వాణినగర్ గీతా విద్యాలయంలో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటి విడతలో ఆదిలాబాద్, పటాన్‌చెరు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత శుక్రవారం మల్కాజిగిరిలో రోడ్‌షోతో పాటు నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. జగిత్యాల సభతో ప్రధాని మలివిడత ప్రచార సభలు ముగుస్తాయి.
సంబంధిత కథనం