Konda Vishweshwar Reddy : తెలంగాణలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి కొండా, నివేదితకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ!
Konda Vishweshwar Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తిని రూ.4568 కోట్లుగా ప్రకటించారు.
Konda Vishweshwar Reddy : రాష్ట్రంలో అత్యంత సంపన్న బీజేపీ ఎంపీ అభ్యర్థిగా (చేవెళ్ల) కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) రికార్డు సృష్టించారు. సోమవారం ఆయన ఎన్నికల అధికారికి తన అఫిడవిట్ సమర్పించారు. అందులో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి రూ.4,568 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన పేరు మీద మాత్రమే రూ.1179.22 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. తన భార్య సంగీత రెడ్డి పేరిట రూ.3203 కోట్లు ఉన్నట్టు తెలిపారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లు ఉంటుందని ప్రకటించారు. ఇక కొడుకు విరాజ్ మాధవ్ పేరు పై రూ.103 కోట్లు ఆస్తులు ఉంటాయని అఫిడవిట్(Election Affidavit) లో పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అప్పులు రూ.1.76 కోట్లు ఉన్నాయని తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అపోలో గ్రూప్ లో రూ.973 కోట్లు, భార్య సంగీత రెడ్డికి రూ.1500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు హైదరాబాద్(Hyderabad) చుట్టు పక్కల 70 ఎకరాలు తన పేరుపై, తన భార్య పేరుపై 14 ఎకరాలు ఉన్నట్టు వివరించారు. సోమవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థికి రూ.12.34 కోట్ల ఆస్తి, 5 కోట్ల అప్పు
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) అభ్యర్థులు శ్రీ గణేష్, నివేదితలు తమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడిస్తూ ఎన్నికల అఫిడవిట్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వారు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా వారి ఆస్తులు, అప్పులు మిగతా వివరాలను ఒకసారి పరిశీలిస్తే......కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్(Sri Ganesh Narayan) తనకు రూ 12.34 కోట్ల చర, స్థిరాస్తులు, రూ.5.22 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్(Election Affidavit) లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాను రూ. 28.99 లక్షలు ఆదాయపన్ను కట్టినట్టు తెలిపారు. సైనిక్ పురిలో 700 గజాల విస్తీర్ణంలో ఫ్లాట్లతో పాటు 5 కార్లు ఉన్నట్టు శ్రీ గణేష్ తెలిపారు. అలాగే ఆయన వద్ద నగదు రూ.1.08 లక్షలు, తన భార్య వర్ష వద్ద రూ.27 వేలు ఉన్నాయని వెల్లడించారు. గణేష్ పేరిట కోటక్ మహేంద్ర బ్యాంక్ లోని వేర్వేరు ఖాతాల్లో కలిపి మొత్తం రూ.3.35 లక్షలు, రూ.35 వేలు అలాగే యాక్సిస్ బ్యాంక్ లో రూ.30,453, ఇండస్ ఇండియా బ్యాంక్ లో రూ.1.61 లక్షలు ఉన్నటు వివరించారు. ఇక అయన భార్య వర్ష పేరిట యాక్సిస్ బ్యాంక్ లో వేర్వేరు ఖాతాల్లో రూ.27,924, రూ.20,944 బ్యాలన్స్ అలాగే తన కుమారుడు ముకుల్ అకౌంట్ లో రూ.6,979 ఉన్నట్టు తెలిపారు. రూ.26.7 లక్షలు విలువ చేసే ఫార్చూనర్ కారు. రూ.29.24 లక్షల కీయ కార్నివాల్ కారు, రూ.18 లక్షల కీయ సెల్టోస్, రూ.13.07 లక్షల ఇసుజు కారు ఉన్నటు తెలిపారు. తన భార్య పేరుపై రూ.11 లక్షలు విలువ చేసే ఇన్నోవా ఉందని పేర్కొన్నారు.
నివేదితకు ఆస్తుల కన్నా....అప్పులే ఎక్కువ
బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి(Cantonment BRS Candidate)గా నామినేషన్ దాఖలు చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదితన(Niveditha)కు ఎలాంటి స్థిరాస్తులు లేవని తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తంగా తన చరాస్తులు రూ. 85 లక్షలుగా పేర్కొన్న ఆమె అప్పులు మాత్రం తనకు 86.45 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. తనకు రూ. 5 లక్షల విలువ చేసే మహేంద్ర కారు, రూ. 33 లక్షల విలువ చేసే 450 గ్రాముల బంగారం, లక్ష రూపాయల విలువ చేసే కిలోన్నర వెండి ఆభరణాలు ఉన్నాయని ఆమె పేర్కొంది. చేతిలో నగదు రూ.1,45,000, అశోక్ నగర్ ఎస్బీఐలో రూ.5000, తాజాగా ఎన్నికల కోసం తీసిన కంటోన్మెంట్ కెనరా బ్యాంకులో రూ.39,90,000 ఉన్నట్టు ఆమె వివరించారు. బీపీసీఎన్ బ్యాంక్ లో మరో రూ.4 లక్షలు ఉన్నట్టు ఆమె వెల్లడించారు. గచ్చిబౌలిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.86.35 లక్షల లోన్ ఉన్నట్టు నివేదిత ప్రకటించారు. గత నాలుగు ఏళ్లుగా తాను ఇన్కమ్ టాక్స్ కడుతున్నట్లు వివరించినారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,96,590 టాక్స్ కట్టినట్టు చూపించారు. బొజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి నివేదిత బీటెక్ పూర్తి చేశారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా