Hyderabad Bogus Votes : హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు తొలగింపు, ఆ పార్టీపై ప్రభావం పడనుందా?-hyderabad lok sabha elections nearly 5 lakh fake votes deleted may affect mim ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Bogus Votes : హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు తొలగింపు, ఆ పార్టీపై ప్రభావం పడనుందా?

Hyderabad Bogus Votes : హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు తొలగింపు, ఆ పార్టీపై ప్రభావం పడనుందా?

HT Telugu Desk HT Telugu
Apr 22, 2024 08:09 PM IST

Hyderabad Bogus Votes : హైదరాబాద్ లో బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘం జల్లెడ పట్టింది. గత ఏడాది జనవరి నుంచి దాదాపుగా 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను తొలగించారు. నకిలీ ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు తొలగింపు
హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు తొలగింపు

Hyderabad Bogus Votes : హైదరాబాద్ (Hyderabad)జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో గత ఏడాది జనవరి నుంచి ఎన్నికల అధికారులు దాదాపు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను(Fake Votes) తొలగించారు. అయితే ఈ బోగస్ ఓట్లన్నీ మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు చెందినవి కావడంతో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లలు ఉండగా.... ఎంఐఎం పార్టీ చేతిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరో మూడు నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు(Minority Votes) కీలకంగా మారాయి. అయితే నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు మార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో బోగస్ ఓట్లపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బోగస్ ఓట్ల తొలగింపుపై ఫిరోజ్ ఖాన్ యుద్ధం మొదలు పెట్టారు. చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఆయనతో పాటు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవి లత(BJP MP Candidate Madhavi Latha) బోగస్ ఓట్లను తొలగించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి హైదరాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లపై దృష్టి పెట్టి....నకిలీ ఓట్లను తొలగించింది. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాలలోనే ఉండడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అత్యధికంగా నాంపల్లి నియోజకవర్గంలోనే

బోగస్ ఓట్లు అత్యధికంగా నాంపల్లి(Nampally) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 21,407 నకిలీ ఓటర్లు ఉండడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. తొలగించిన వారిలో 15,963 మంది ఇండ్లు మారగా...... 2,843 మంది ఓటర్లు చనిపోయారు. మరో 2,601 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. నాంపల్లితో పాటు జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం లో 21,222 బోగస్ ఓటర్లను ఎన్నికల అధికారులు తొలగించారు. వీటిలో 16,658 మంది షిఫ్ట్ అయిన వారు ఉండగా...... 3,754 మంది బోగోస్ ఓటర్లు(Bogus Votes), 810 మంది చనిపోయిన వారు ఉన్నారు. ఇక కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,722 మందిని జాబితా నుంచి తొలగించారు. వీరిలో 12,527 మంది ఇండ్లు మారగా..... 487 మంది బోగోస్ ఓటర్లు ఉన్నారు. మరో 350 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు. ఇవే కాకుండా పాత బస్తి పరిధిలోని చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించడంతో దీని ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై చూపే అవకాశం ఉంది.

తొలగింపు ప్రక్రియ ఇలా

సుమారు 15 నెలలుగా జిల్లాలో బోగస్ ఓట్ల (Bogus Votes)తొలగింపునకు ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయని వారు, ఇండ్లు మారిన వారు, చనిపోయిన వారిని గుర్తించి వారిని ఓట్ల జాబితా నుంచి తొలగించారు. 2023 జనవరి నుంచి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,41,259 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 47,140 మంది మరణించారని, 4,39,801 మంది ఇండ్లు మారారని, మరో 54,259 నకిలీ ఓటర్లు ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం.....హైదరాబాద్ (Hyderabad)జిల్లాలోని అన్నీ సెగ్మెంట్లలో కలిపి సుమారు 45.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 33 వేలకు పైగా అధికం. అయితే ఇటీవలే ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారులు పోలింగ్(Polling) కు హాజరు కాని ఇండ్ల పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత లక్ష బోగస్ ఓట్లు తొలగింపు

హైదరాబాద్(Hydreabad) జిల్లాలో ఇండ్లు మారిన వారు, చనిపోయిన వారు మొత్తం 1,09,117 ఓట్లు తొలగించారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా సగటు ఓటర్ల జాబితా నిష్పత్తి 68 శాతంగా ఉంటే హైదరాబాద్ జిల్లాల్లో ఇది 75.3 శాతంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లక్షలకు పైగా ఓట్లు తొలగించకుండా ఉంటే ఇది మరింత అధికంగా ఉండేది. భారత ఎన్నికల సంఘం(ECI) నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఫారం 7, ఫారం 8 ప్రకారమే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఓటరు జాబితా ప్రక్షాళన సమయంలో చాలామంది ఓటర్ల జాబితాలపై ప్రామాణికం కానీ ఇంటి నంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అటువంటి ఓటర్లను గుర్తించి సవరణలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. దీని ప్రకారం మొత్తం 1,81,405 ఓటర్లు నాన్ స్టాండర్డ్ ఇంటి నెంబర్లు గుర్తించి వారి ఇంటి నెంబర్లలో అధికారులు సవరణలు చేశారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel