election schedule: ఏప్రిల్ 19 నుంచి ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు; జూన్ 4న ఫలితాలు
కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 విడతల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 543 మంది ఎంపీలను ఎన్నుకుంటారు.
18వ లోక్ సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో జరుగుతాయని వెల్లడించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు.
సిద్ధంగా ఉన్నాం..
లోక్ సభ, నాలుగు అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత లోక్ సభ కాల పరిమితి జూన్ 24వ తేదీతో ముగుస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 47.1 కోట్ల మంది మహిళలని తెలిపారు. మొత్తంగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటర్ల సంఖ్య 1.82 కోట్లు అని సీఈసీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో 55 లక్షలకు పైగా ఈవీఎంల ను ఉపయోగించబోతున్నామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగు నీరు, హెల్ప్ డెస్క్, వీల్ చెయిర్, ర్యాంప్ తదితర సదుపాయాలు ఉంటాయన్నారు.
ఈ యాప్స్ ను ఉపయోగించుకోండి..
తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ‘నో యువర్ క్యాండిడేట్’ యాప్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చని రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే, ఏవైనా ఫిర్యాదులుంటే, ‘సీ విజల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాజకీయ పార్టీలు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను కచ్చితంగా ఫాలో కావాలన్నారు.
ఎన్నికల తేదీలు..
- మొదటి దశ
ఎన్ని స్థానాలు: 102
ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 20
ఎన్నికల తేదీ: ఏప్రిల్ 19
- రెండవ దశ
ఎన్ని స్థానాలు: 89
ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 28
ఎన్నికల తేదీ: ఏప్రిల్ 26
- మూడో దశ
ఎన్ని స్థానాలు: 94
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 12
ఎన్నికల తేదీ: మే 7
- నాలుగో దశ
ఎన్ని స్థానాలు: 96
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 18
ఎన్నికల తేదీ: మే 13
- ఐదో దశ
ఎన్ని స్థానాలు: 49
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 22
ఎన్నికల తేదీ: మే 20
- ఆరో దశ
ఎన్ని స్థానాలు: 57
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 29
ఎన్నికల తేదీ: మే 25
- ఏడో దశ
ఎన్ని స్థానాలు:
ఎన్నికల నోటిఫికేషన్: మే 7
ఎన్నికల తేదీ: జూన్ 1
- కౌంటింగ్, ఫలితాల ప్రకటన: జూన్ 4
2019 లో..
2019 లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు జరిగాయి. మే 23వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.