Jagtial News : కొడుకుతో ఇంటి వివాదం, జగిత్యాలలో 82 ఏళ్ల బామ్మ నామినేషన్
Jagtial News : జగిత్యాలలో 82 ఏళ్ల బామ్మ నామినేషన్ దాఖలు చేశారు. తన సమస్యను అధికారులు పట్టించుకోలేదని అందుకే నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు.
Jagtial News : ఆమె ఓ స్వతంత్ర సమరయోధురాలు...కానీ కన్న వాళ్లే ఆమెని పట్టించుకోలేని పరిస్థితి. తన కుమారుడు వల్ల ఎదురు అవుతున్న సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు పట్టించుకోకపోవడంతో ఆ బామ్మ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 82 ఏళ్ల బామ్మ నామినేషన్ దాఖలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పెద్ద కుమారుడు వల్లే నామినేషన్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యలకు చెందిన చిటీ గంగాధర రావు భార్య శ్యామల ఇద్దరూ ఒకప్పటి స్వతంత్ర సమరయోధులు. కాగా భర్త గంగాధరరావు మరణించడంతో చిటీ శ్యామల జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కుమారుడుతో వచ్చిన విభేదాల కారణంగానే తాను నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని శ్యామల వెల్లడించారు. తన పెద్ద కొడుకు రామారావు ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించడంతో తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదని చెప్పారు శ్యామల. అయితే వృద్ధాప్యానికి చేరుకున్న తనను తన పెద్ద కుమారుడు రామారావు బాగోగులు చూసుకోవడం లేదని, పెద్ద కుమారుడు కారణంగా తాను వృద్ధాప్యంలో కూడా అద్దె నివాసంలో ఉండాల్సి వస్తుందని ఆమె ఆరోపించారు.
నా ఇంటిని నాకు ఇప్పించండి
తనకు న్యాయం చేయాలని అనేక మంది ప్రముఖులను ఆశ్రయించి వినతి పత్రాలు అందచేసినా ఎవరూ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆరోపించారు. 82 ఏళ్ల వయసులో కూడా న్యాయం కోసం అందరి చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడు సమాజానికి తెలియాలనే ఇలా నామినేషన్ దాఖలు చేశానని ఆమె స్పష్టం చేశారు. మరో వైపు కొందరు సీఎం కేసీఆర్ బంధువులం అని చెప్తూ తనని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు శ్యామల తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన ఇంటిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్