Minister Harish Rao : కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం- మంత్రి హరీశ్ రావు-gajwel minister harish rao says no parallel leader with kcr in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Minister Harish Rao : కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం- మంత్రి హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2023 08:57 PM IST

Minister Harish Rao : తెలంగాణ ద్రోహులంతా ఏకమైనా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి హరీశ్ రావు అన్నారు. డీకే శివకుమార్, పవన్ కల్యాణ్, షర్మిల ఇలా ఎంతమంది వచ్చినా కేసీఆర్ ను ఏం చేయలేరన్నారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : కాంగ్రెస్, బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే తాము కూడా పెద్దవాళ్లం అవుతామని ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా వారు ఓడిపోవడం ఖాయమని, కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరని హరీశ్ రావు అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్, బీజేపీతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్ వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏమీ చేయలేరని మండిపడ్డాడు.

రేపు సీఎం గజ్వేల్ లో నామినేషన్

గురువారం నామినేషన్ వేయడానికి సీఎం కేసీఆర్ గజ్వేల్ కు రానున్నారు. దీంతో బుధవారం గజ్వేల్ లో ఐఒసి మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ వేసేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. గజ్వేల్ లో నామినేషన్ వేసిన అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకుని అక్కడ నామినేషన్ వేస్తారు. నామినేషన్ పూర్తి అయినా అనంతరం కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

కేసీఆర్ కు సరితూగే నాయకుడు మరెవరూ లేరు

సీఎం కేసీఆర్ జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారని, ఇంకెవరు ఆయనపై పోటీకి వచ్చినా అది నామ మాత్రమే అని అన్నారు. మంగళవారం గజ్వేల్ లో జరిగిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీలో కిరాయి మనుషులను పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి తెచ్చుకుని షో చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కిరాయి మనుషులను తెచ్చుకుని షో చేయాల్సిన అవసరం లేదని, మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారని హరీశ్ రావు అన్నారు.

గజ్వేల్ లోనే ముగింపు సభ

గజ్వేల్ ప్రజలు కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. వేరే వాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ 2014, 2018లో సీఎంతో గజ్వేల్ లో చేసుకుని రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నామన్నారు. ఈనెల 28న నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కేసీఆర్ కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. గజ్వేల్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని, రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ కు రాబోతుందన్నారు. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతామని అన్నారు.

తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారు

తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారని షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్ బీజేకి మద్దతు పలుకుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బీజేపీ రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి వాళ్ల చేతుల్లో పభుత్వాన్ని పెడితే ఆగం అవుతామన్నారు. రిస్క్ లేకుండా తాగు నీళ్లు, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయన్నారు. కావున రిస్క్ తీసుకుని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకని ప్రశ్నించారు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో, కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అంత మేలు జరుగుతుందని, సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.

Whats_app_banner